కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కోసం భారత దిగ్గజ క్రికెటర్లు రంగంలోకి దిగారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు తక్షణ వైద్య చికిత్స అందించాలని ప్రపంచ క్రికెట్ దిగ్గజాలతో కలసి ఉమ్మడిగా లేఖ విడుదల చేశారు. ఇమ్రాన్ చూపు దెబ్బతింటోందనే వార్తల మధ్య ఈ విజ్ఞప్తి అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విజేత ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న సమాచారం వెలువడడంతో వివిధ దేశాల క్రికెట్ మాజీ కెప్టెన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 17న విడుదలైన అధికారిక లేఖపై పలువురు అంతర్జాతీయ క్రికెట్ ప్రముఖులు సంతకాలు చేశారు. భారత క్రికెట్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ కూడా ఈ లేఖకు మద్దతు ఇచ్చారు.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) హక్కులను కాపాడాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. లేఖలో పలు డిమాండ్లు ఉంచారు. ఇమ్రాన్ కోరుకున్న నిపుణుల వైద్యులతో వెంటనే చికిత్స అందించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా గౌరవప్రద నిర్బంధ పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులను కలిసే అనుమతి ఇవ్వాలని కోరారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా పారదర్శక న్యాయ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
మైదానంలో పోటీ ముగిసినా గౌరవం శాశ్వతమని మైఖేల్ అథర్టన్, అలెన్ బోర్డర్, స్టీవ్ వా వంటి దిగ్గజాలు లేఖలో గుర్తు చేశారు. ఇమ్రాన్ ఖాన్ క్రికెట్‌కు మాత్రమే కాకుండా దేశ ప్రధానిగా కూడా సేవలందించారని పేర్కొన్నారు. ఈ లేఖపై గవాస్కర్ (Sunil Gavaskar), కపిల్ దేవ్, అథర్టన్, అలెన్ బోర్డర్, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, నాసిర్ హుస్సేన్, డేవిడ్ గోవర్, జాన్ రైట్ తదితరులు సంతకాలు చేశారు.
Read Also: కంటతడి పెట్టిన ఎర్రబెల్లి
Follow Us On : WhatsApp


