కలం, స్పోర్ట్స్ : జూన్ 15 నుంచి 21 వరకు న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగబోయే ఎఫ్‌ఐహెచ్ మహిళల నేషన్స్ కప్ కోసం హాకీ ఇండియా (FIH Women Hockey) 20 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో సలీమా టెటె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు లాల్తాంట్లువాంగి, శిల్పి దాస్‌లకు ఈ జట్టులో చోటు దక్కింది.
ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన 4 మ్యాచ్‌ల ఫ్రెండ్లీ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకున్న భారత జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. రాబోయే ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్ వంటి పెద్ద టోర్నమెంట్లకు ముందు ఈ నేషన్స్ కప్ తమకు ఎంతో కీలకమని చీఫ్ కోచ్ ష్యోర్డ్ మరీనే పేర్కొన్నారు. జట్టులో సవిత, సుశీల, నిక్కీ, నవనీత్ వంటి సీనియర్ల అనుభవంతో పాటు యువ ఆటగాళ్ల వేగం కలసిరావడం జట్టుకు పెద్ద బలం అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత జట్టు వివరాలు:
గోల్‌కీపర్లు: సవిత, బిచ్చు దేవి ఖరీబమ్.
డిఫెండర్లు: సుశీల చాను, ఇషికా చౌదరి, లాల్తాంట్లువాంగి, శిల్పి దాస్, జ్యోతి, నిక్కీ ప్రధాన్.
మిడ్‌ఫీల్డర్లు: సలీమా టెటె (కెప్టెన్), నేహా, సునేలిత తోప్పో, సాక్షి రాణా, దీపికా సోరెంగ్, సోనమ్, లాల్రెమ్సియామి.
ఫార్వర్డ్స్: నవనీత్ కౌర్, దీపిక, రుతుజా దాదాసో పిసల్, ఇషిక, అన్ను.
ఈ టోర్నమెంట్‌లో భారత్ పూల్-ఎ లో జపాన్, అమెరికా, ఉరుగ్వేలతో కలిసి పోటీ పడనుంది. జూన్ 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రచారాన్ని ప్రారంభిస్తుంది. ఆ తర్వాత జూన్ 16న జపాన్‌తో, జూన్ 18న ఉరుగ్వేతో లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 20న సెమీఫైనల్స్, జూన్ 21న ఫైనల్ జరుగుతాయి. ప్రస్తుత ఫామ్ ప్రకారం భారత మహిళల జట్టు ఈ టోర్నమెంట్‌లో గట్టి పోటీనిస్తుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

