కలం, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా చెన్నూరు (Chennur)లో శనివారం తీవ్ర కలకలం రేగింది. ఆక్రమణకు గురైన దేవాదాయ శాఖకు చెందిన భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులపై కబ్జాకోరులు అమానుషంగా దాడికి తెగబడ్డారు. విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడమే కాకుండా.. వారిపై ముందస్తు ప్రణాళికతో తెచ్చుకున్న కారంపొడిని చల్లారు. అంతేకాదు కొందరు దుండగులు అధికారులపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు యత్నించారు.
కబ్జాకోరుల ఊహించని ఈ ఘోర దాడితో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే ప్రాణాలను దక్కించుకోవడానికి అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రభుత్వ అధికారులపైనే ఇంతటి దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలకు దిగుతుందనేది ఆసక్తికరంగా మారింది.

