కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో జనసేన (Janasena) పార్టీ ఎప్పటికీ ఉంటుందని, ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తుందని, స్వయంగా నేనే ఊరూరా తిరుగుతానని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించారు. తెలంగాణ (Telangana) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు జనసేన ప్లాన్ చేసిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు ఎంతో మంది చనిపోతే 12 సంవత్సరాల్లో 1200 మంది చనిపోతే వారి గౌరవార్థం ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అంత ఇష్టమని చెప్పారు. ఇప్పుడు తెలంగాణపై ఆయన ప్రేమను శంకిస్తే ఊరుకునేది లేదన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుందని, తప్పకుండా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే నేనే తెలంగాణలో తిరుగుతానని పవన్ ప్రకటించారు. ప్రతి సమస్యపై గళం విప్పుతామని, క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తానని చెప్పారు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటామన్నారు. తెలంగాణ భారత దేశంలో అంతర్భాగం అని ఎవరూ మర్చిపోవద్దని చెప్పారు. తనను కూర్చోబెట్టి బెదిరించి రాకూడదు అంటే సహించేది లేదన్నారు. ఇప్పటికే ఎన్నో భరించామని, దీనికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లే ఇప్పుడు అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు.
నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై స్పందించిన పవన్
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు తన గురించి చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. తాను, అమిత్ షా ఏదో మాట్లాడుకుంటే నాగేశ్వర్ రావు విన్నట్లుగా లేనిపోనివి క్రియేట్ చేసి మాట్లాడటం సరి కాదన్నారు. అందుకే ఆయన వ్యాఖ్యలను ఖండించినట్లు తెలిపారు. గత పన్నెండేళ్లలో తాను ఎప్పుడూ కేసీఆర్ గురించి కానీ, తెలంగాణ నేతల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని పవన్ అన్నారు. కానీ, తెలంగాణలో ఇప్పుడు తాను ఇష్టపడే వారు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, తనకు ఈ విషయం బాధగా ఉందని చెప్పారు. తనను భయపెట్టే కొద్దీ గుండె గట్టిపడుతుందే కానీ, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. గతంలో తనను వైఎస్ఆర్ రెచ్చగొట్టినందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం తనను కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నారని, వాళ్లకు తన అడ్రస్ చెప్పేందుకే ఈ మీడియా సమావేశం పెట్టానని పవన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చా అని, తాను మాత్రం తెలంగాణకు రాకూడదా అని పవన్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. దీనికి రాహుల్, ప్రియాంకా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక కోడి చెరువు ఆక్రమణపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజంగా తాను కబ్జా చేసినట్లయితే దానిని సీజ్ చేయాలన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తెలంగాణలో అడుగుపెట్టబోనని తేల్చి చెప్పారు.

