కలం, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ (Peddapalli MP) గడ్డం వంశీకృష్ణ (Gaddam Vamsi Krishna) పాల్గొన్నారు. సుమారు రూ.20 లక్షల నిధులతో పలు బోర్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. ధర్మపురి–కోటిలింగాల ఆలయాలకు వేల ఏళ్ల చరిత్ర ఉందని, ఈ ప్రాంతాన్ని సిటీగా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తూ ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. రాజకీయ అంశాలపై స్పందిస్తూ, అయోధ్య రామాలయ నిర్మాణంలో భారీ అవినీతి ఆరోపణలు ఉన్నాయని, రాముడి పేరును బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తోందని విమర్శించారు.
అలాగే పార్లమెంట్‌లో మెజారిటీ కోసం ఇతర పార్టీల ఎంపీలను ఆకర్షించే రాజకీయాలు జరుగుతున్నాయని, సీబీఐ, ఈడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నాయకులను బెదిరించడానికి వినియోగిస్తున్నారని ఆరోపించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, రాష్ట్ర హక్కులు, అభివృద్ధి అంశాలపై గట్టిగా పోరాడి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఎంపీ స్పష్టం చేశారు.
అనంతరం ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త పాలకుర్తి చిన్న రాజేశం గౌడ్, అమరగోని అంజయ్య గౌడ్, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

