కలం, వెబ్ డెస్క్: వియత్నాంలోని దానాంగ్‌లో జరుగుతున్న యూ17 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ మహిళా రెజ్లర్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన పోటీల్లో మన అమ్మాయిలు రెండు బంగారు పతకాలతో పాటు మొత్తం ఐదు పతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో అంతర్జాతీయ వేదికపై భారత యువ రెజ్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. ఈ పోటీలు మొదలైనప్పటి నుంచి భారత క్రీడాకారులు దూకుడుగా ఆడారు.
మొదటగా 43 కేజీల విభాగంలో దీక్ష తిరుగులేని ప్రదర్శన ఇచ్చారు. ఫైనల్ చేరే క్రమంలో కిర్గిజిస్తాన్, వియత్నాం రెజ్లర్లపై భారీ పాయింట్ల తేడాతో గెలిచిన ఆమె, ఆఖరి పోరులో కిర్గిజిస్తాన్‌కు చెందిన అసంగర్యేవాను 6-0 తో ఓడించి దేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించారు. ఆ వెంటనే 73 కేజీల విభాగంలో గరిమ తన అటాకింగ్ గేమ్‌తో మంగోలియాకు చెందిన నముంత్‌సెసెగ్‌పై 18-6 తో ఘనవిజయం సాధించి రెండో స్వర్ణాన్ని ముద్దాడారు.
ఇక 49 కేజీల విభాగంలో నికిత, 65 కేజీల విభాగంలో అంత్ర గట్టిగా పోరాడినప్పటికీ ఫైనల్లో చైనా రెజ్లర్ల చేతిలో ఓడిపోయి వెండి పతకాలతో సరిపెట్టుకున్నారు. మరోవైపు 57 కేజీల విభాగంలో సాక్షి సెమీఫైనల్లో తృటిలో ఓడినప్పటికీ, బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో కజకిస్తాన్‌కు చెందిన అరినాపై 10-0 తో ఏకపక్ష విజయం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. నిజానికి ఇదే వారంలో జరిగిన యూ23 ఆసియా ఛాంపియన్‌షిప్‌లోనూ భారత రెజ్లర్లు చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు.
ఆ టోర్నీలో భారత పురుషుల ఫ్రీస్టైల్ జట్టు కిర్గిజిస్తాన్, కజకిస్తాన్ వంటి బలమైన దేశాలను వెనక్కి నెట్టి ఏకంగా టీమ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అక్కడ మహిళల జట్టు కూడా ఆరు బంగారు పతకాలతో సహా మొత్తం పది పతకాలు సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆ టోర్నీ మొత్తంలో భారత్ 27 పతకాలతో రికార్డు సృష్టించింది. వరుసగా జరుగుతున్న ఈ వయోవిభాగపు పోటీలలో భారత యువత సాధిస్తున్న విజయాలు చూస్తుంటే, దేశంలో మహిళా రెజ్లింగ్‌కు ఎంతటి ప్రతిభావంతమైన భవిష్యత్తు ఉందో స్పష్టమవుతోంది. ఈ టోర్నమెంట్‌లో మిగిలిన పోటీలు కూడా ఇదే ఉత్సాహంతో సాగుతాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.

