చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు డబుల్ ధమాకా

కలం, స్పోర్ట్స్ : చెస్ ఒలింపియాడ్‌లో(Chess Olympiad 2026) భారత జట్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పంట పండించాయి. మహిళల విభాగంలో కాంస్య పతకం, ఓపెన్ విభాగంలో రజత పతకం సాధించిన భారత్.. రెండు విభాగాల్లో కలిపి అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేశానికి అందించే గ్యాప్‌రిండాష్‌విలి కప్‌ను కూడా సొంతం చేసుకుంది. మహిళల విభాగంలో చివరి రౌండ్‌లో జార్జియాతో జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. చివరి బోర్డుపై సవిత శ్రీ కీలక డ్రాతో భారత్‌కు పతకాన్ని ఖాయం చేశారు. 17 పాయింట్లతో భారత మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. చైనా స్వర్ణం, కజకిస్థాన్ రజతం సాధించాయి.

మ్యాచ్‌లో తొలుత కోనేరు హంపి విజయం సాధించగా.. దివ్య దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. వంతిక అగర్వాల్ డ్రా చేసుకోవడంతో చివరి బోర్డుపై సవిత శ్రీ ఫలితం కీలకంగా మారింది. అరబిడ్జ్‌తో జరిగిన గేమ్‌లో ఆరంభంలో సవితకు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆమె పట్టుదలగా పోరాడారు. 83 ఎత్తుల పాటు సాగిన గేమ్ చివరకు డ్రాగా ముగిసింది. దీంతో భారత్ కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.

ఓపెన్ విభాగంలోనూ భారత్ రజత పతకం సాధించింది. చివరి రౌండ్‌లో హంగేరీతో జరిగిన మ్యాచ్ 2-2తో ముగిసింది. అర్జున్ ఎరిగైసీ కీలక విజయం సాధించగా.. ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ డ్రా చేసుకున్నారు. గుకేశ్ ఓటమి పాలయ్యారు. 18 పాయింట్లతో భారత్, జర్మనీ సమంగా నిలిచాయి. అయితే టైబ్రేక్‌లో భారత్ ముందంజలో నిలవడంతో రజత పతకం దక్కింది. ఉజ్బెకిస్థాన్ స్వర్ణ పతకాన్ని సాధించింది. మహిళల కాంస్యం, ఓపెన్ రజతంతో భారత్ రెండు విభాగాల్లో కలిపి అత్యుత్తమ ప్రదర్శన చేసిన దేశంగా నిలిచి గ్యాప్‌రిండాష్‌విలి కప్‌ను కూడా సొంతం చేసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>