కలం, వెబ్ డెస్క్: ఆర్థిక నష్టాలతో కుంగిపోయిన ఓ వ్యక్తి తన పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయవిదారక ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో (Bapatla Tragedy) చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, అనారోగ్య ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ తండ్రి తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి, అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. రామకృష్ణ అనే వ్యక్తి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుతన్నాడు. పెద్ద కుమారుడు వైకల్యంతో బాధపడుతుండటంతో పాటు, అతడికి అవసరమైన వినికిడి పరికరం కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. మరోవైపు రామకృష్ణ కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారడంతో దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
ఇద్దరు కొడుకులకు విషమిచ్చిన రామకృష్ణ.. అనంతరం తానూ ఉరివేసుకున్నారు. ఈ ఘటనలో 13 ఏళ్ల పెద్ద కుమారుడు చికిత్స పొందుతూ మరణించగా.. చిన్న కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

