కలం, స్పోర్ట్స్ : భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు (India Hockey) ఆసియా కప్ (Asia Cup) లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. జపాన్‌లో బుధవారం జరిగిన చివరి పూల్-ఏ మ్యాచ్‌లో చైనీస్ తైపీపై 13-1 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలుపులతో తొమ్మిది పాయింట్లు సాధించింది. కజకిస్థాన్, కొరియాపై గెలిచిన భారత్, ఆతిథ్య జపాన్ చేతిలో మాత్రమే ఓడింది. చైనీస్ తైపీతో మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఏడో నిమిషంలో కరణ్ గౌతమ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఖాతా తెరిచాడు.
ఆ తర్వాత ప్రేమ్‌చంద్ సోయ్, కెప్టెన్ కేతన్ కుష్వాహా వరుసగా గోల్స్ చేసి తొలి క్వార్టర్ ముగిసే సరికి స్కోరును 3-0కు చేర్చారు. రెండో క్వార్టర్‌లో కూడా భారత ఆటగాళ్లు అదే జోరు కొనసాగించారు. రాహుల్ యాదవ్ నాలుగో గోల్ సాధించగా, ఆశిష్ తాని పుర్తి పెనాల్టీ కార్నర్ ద్వారా మరో గోల్ జోడించాడు. హాఫ్‌టైమ్‌కు క్షణాల ముందు సిద్ధార్థ్ బెన్ కూడా గోల్ నమోదు చేశాడు. అయితే విరామానికి ముందు చైనీస్ తైపీ ఒక గోల్ సాధించడంతో స్కోరు 6-1గా మారింది.
రెండోార్థంలో భారత్ మరింత దూకుడుగా ఆడింది. ఆశిష్ తాని పుర్తి మరో రెండు గోల్స్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. గాజీ ఖాన్ రెండు గోల్స్ సాధించాడు. దీంతో చివరి క్వార్టర్‌కు వెళ్లే సమయానికి భారత్ 10-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి క్వార్టర్‌లో కూడా భారత జట్టు ఒత్తిడి తగ్గించలేదు. వరిందర్ సింగ్, సిద్ధార్థ్ బెన్, రాహుల్ యాదవ్ మరో మూడు గోల్స్ జోడించి స్కోరును 13-1కు చేర్చారు.
ఈ మ్యాచ్‌లో ఆశిష్ తాని పుర్తి హ్యాట్రిక్‌తో మెరిశాడు. గాజీ ఖాన్, సిద్ధార్థ్ బెన్, రాహుల్ యాదవ్ తలో రెండు గోల్స్ చేశారు. కరణ్ గౌతమ్, ప్రేమ్‌చంద్ సోయ్, కేతన్ కుష్వాహా, వరిందర్ సింగ్ తలో గోల్ సాధించారు. ఈ విజయంతో భారత్ సెమీఫైనల్‌లో స్థానం ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగే సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఎవరో జపాన్-కజకిస్థాన్ మ్యాచ్ ఫలితం తర్వాత తేలనుంది.

