కలం, వెబ్ డెస్క్ : యూఎస్ ఓపెన్ 2026 (US Open 2026) బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు మరోసారి తమ సత్తా చాటారు. పురుషుల సింగిల్స్‌లో రౌనక్ చౌహాన్, కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్‌కు చేరగా.. మహిళల సింగిల్స్‌లో దేవికా సిహాగ్ కూడా చివరి నాలుగులో స్థానం దక్కించుకుంది. మరోవైపు తన్వి శర్మ, రక్షిత రామ్రాజ్ మాత్రం క్వార్టర్ ఫైనల్లో పోరాడి నిష్క్రమించారు. కేవలం 18 ఏళ్ల రౌనక్ చౌహాన్ టోర్నీలో తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఇజ్రాయెల్‌కు చెందిన మిషా జిల్బర్మాన్ను 23-21, 21-11 తేడాతో ఓడించాడు.
అంతకుముందు ప్రిక్వార్టర్లో ప్రపంచ ఆరో ర్యాంకర్, చైనీస్ తైపీ ఆటగాడు చౌ టియెన్ చెన్ను 21-17, 26-24తో మట్టికరిపించి సంచలనం సృష్టించాడు. ఈ విజయంతో తన కెరీర్లో తొలిసారి బీడబ్ల్యూఎఫ్ టోర్నీ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. మరో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ కూడా సెమీస్ టికెట్ ఖాయం చేసుకున్నాడు. చైనీస్ తైపీకి చెందిన లియావో జువో-ఫూను 21-9, 12-21, 21-8తో ఓడించాడు.
తొలి గేమ్‌ను సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్.. రెండో గేమ్‌ను కోల్పోయినా నిర్ణయాత్మక గేమ్‌లో అద్భుతంగా పుంజుకుని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సెమీఫైనల్లో రౌనక్ చౌహాన్ ఎనిమిదో సీడ్ సూ లీ యాంగ్తో తలపడనున్నాడు. మరోవైపు శ్రీకాంత్ నాలుగో సీడ్ యుడి ఒకిమోటోతో పోటీ పడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో ఆరో సీడ్ దేవికా సిహాగ్ కూడా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ రికో గుంజీపై 22-20, 21-19తో ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. సెమీస్‌లో రెండో సీడ్ లైన్ క్రిస్టోఫర్సన్ను ఎదుర్కోనుంది.
అయితే భారత యువ షట్లర్ తన్వి శర్మ ప్రయాణం క్వార్టర్ ఫైనల్‌తో ముగిసింది. డెన్మార్క్‌కు చెందిన లైన్ క్రిస్టోఫర్సన్తో జరిగిన పోరులో 16-21, 21-11, 11-21 తేడాతో ఓడిపోయింది. మరో భారత షట్లర్ రక్షిత రామ్రాజ్ కూడా క్వార్టర్ ఫైనల్లో పోరాడి నిష్క్రమించింది. కెనడాకు చెందిన రాచెల్ చాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచినా.. తర్వాతి రెండు గేమ్‌ల్లో వెనుకబడడంతో 21-15, 16-21, 12-21తో పరాజయం చవిచూసింది.

