Mobile Popup Ad
Mobile Popup Ad

U-18 ఆసియా కప్ సెమీస్‌లోకి భారత జట్లు

క‌లం, వెబ్ డెస్క్: U-18 ఆసియా కప్ 2026 హాకీ (Asia Cup Hockey) టోర్నీలో భారత జట్లు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో నిలిచాయి. పూల్ స్టేజ్‌లో అదిరిపోయే ఆటతీరును ప్రదర్శించిన భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. జూన్ 5న జరగబోయే ఈ కీలక పోరులో మహిళల జట్టు చైనాతో, పురుషుల జట్టు పాకిస్తాన్‌తో తలపడనున్నాయి. మొదటగా భారత మహిళల జట్టు ప్రయాణాన్ని చూస్తే.. పూల్-ఎ లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి టేబుల్ టాప్‌గా నిలిచింది.

ఈ లీగ్ స్టేజ్‌లో ప్రత్యర్థులపై ఏకంగా 30 గోల్స్ చేసి, కేవలం రెండు గోల్స్ మాత్రమే సమర్పించుకుంది. తొలి మ్యాచ్‌లో మలేషియాపై 2-1తో చెమటోడ్చి గెలిచిన భారత్, ఆ తర్వాత కొరియాను 3-1తో ఓడించింది. ఇక చివరి పూల్ మ్యాచ్‌లో సింగపూర్‌ను 25-0తో క్లీన్‌స్వీప్ చేసి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఈ టోర్నీలో నౌషీన్ నాజ్ 10 గోల్స్, గీతాశ్రీ నమ్మి 5 గోల్స్, కెప్టెన్ స్వీటీ కుజుర్ 4 గోల్స్, ప్రియాంక మింజ్ 3 గోల్స్ చేశారు.

సెమీస్ చేరిన ఆనందంలో మహిళల జట్టు కోచ్ రాణి స్పందించారు. ఈ ఆటగాళ్లకు ఇది మొదటి అంతర్జాతీయ టోర్నీ అయినా అద్భుతంగా రాణించారని మెచ్చుకున్నారు. చైనాతో జరిగే మ్యాచ్‌లో ప్రత్యర్థి గురించి ఆలోచించకుండా, తమదైన శైలిలో అటాకింగ్ హాకీ ఆడుతూ అవకాశాలను గోల్స్‌గా మలచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమ్మాయిలు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నారని, ఫైనల్ చేరడానికి శాయశక్తులా పోరాడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు భారత పురుషుల జట్టు కూడా పూల్-ఎ లో మూడు విజయాలు, ఒక ఓటమితో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో భారత్ 32 గోల్స్ చేయగా, ప్రత్యర్థులకు ఆరు గోల్స్ ఇచ్చింది. కజకిస్తాన్‌పై 13-0తో ఘనవిజయంతో టోర్నీని ప్రారంభించిన భారత్, ఆ తర్వాత ఆతిథ్య దేశం జపాన్ చేతిలో 4-2తో ఓడిపోయింది. అయితే వెంటనే పుంజుకుని కొరియాపై 4-1తో, చైనీస్ తైపీపై 13-1తో భారీ విజయాలు అందుకుంది. భారత్ తరఫున కెప్టెన్ కేతన్ కుష్వాహా 7 గోల్స్, ఆశిష్ తాని పుర్తి 6 గోల్స్ చేయగా, గాజీ ఖాన్, షారూఖ్ అలీ చెరో 3 గోల్స్ చేశారు.

పురుషుల జట్టు కోచ్ సర్దార్ సింగ్ మాట్లాడుతూ.. నాలుగు మ్యాచ్‌ల తర్వాత పెనాల్టీ కార్నర్ అటాక్, డిఫెన్స్ విభాగాల్లో మెరుగుపడాల్సిన అవసరముందని గుర్తించామన్నారు. దీనికోసం డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్లు, ఫార్వర్డ్ ఆటగాళ్లతో విడివిడిగా ప్రాక్టీస్ చేయించి సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆధునిక హాకీలో గెలవడానికి క్రమశిక్షణ, జట్టు ఐక్యత చాలా ముఖ్యమని, ఆటగాళ్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించి మ్యాచ్‌పై పట్టు సాధిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>