కలం, ఖమ్మం బ్యూరో : పాల్వంచ (Palwancha) మండల పరిధిలో నిషేధిత ఎండుగంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను ఖమ్మం అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం గురువారం చాకచక్యంగా పట్టుకుంది. కేశవపురం గ్రామపంచాయితీ పరిధిలో ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఎస్సై శ్రీహరి రావు తన సిబ్బందితో కలిసి ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా మోటార్ సైకిళ్లపై వెళ్తున్న నలుగురు వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద భారీగా గంజాయి లభ్యమైంది.
అధికారులు వారి నుంచి 4.480 కిలోగ్రాముల నిషేధిత ఎండుగంజాయిని సీజ్ చేశారు. వీటితో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు మోటార్ సైకిళ్లను, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలుకు చెందిన ఎస్కే మహమ్మద్ ఆవేజ్ భాష, పశుపాల జగన్నాథ్, అలాగే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా నాలగుంట గ్రామానికి చెందిన ప్రసన్న జీత్ మండల్, ప్రీతం రాయ్‌లుగా అధికారులు గుర్తించారు.
నిషేధిత మత్తు పదార్థాల రవాణాపై సమాచారం అందడంతో అబ్కారీ శాఖ అధికారులు ఈ మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుళ్లు ఎం.డి. ఖలీల్ అహ్మద్, జమాల్ షరీఫ్, కానిస్టేబుళ్లు ప్రసన్న ఉపేందర్, నాగరాజ్, వి. శివ శంకర్‌లు పాల్గొని నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, నిఘాను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

