కలం, వెబ్ డెస్క్: భారత్ ఇప్పుడు మావోయిస్టు రహిత దేశమని అమిత్ షా (Amit Shah) పార్లమెంటులో ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులు లేనేలేరని పేర్కొన్నారు. సోమవారం పార్లమెంటులో మావోయిజం, ఆపరేషన్ కగార్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు ఎందరో అమాయకుల ప్రాణాలు తీశారని ఆరోపించారు. ఇన్ ఫార్మర్ల ముద్ర వేసి ఏ చట్టం కింద అమాయకులను బహిరంగంగా ఉరితీశారని ఫైర్ అయ్యారు.
ఆయుధాలు వీడాల్సిందే
మావోయిస్టులు అందరూ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని అమిత్ షా (Amit Shah) పేర్కొన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు అధికారంలో ఉన్నా.. ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. తమ పాలనలోనే ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు. బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని పేర్కొన్నారు.
సమాంతర ప్రభుత్వం నడిపారు
మావోయిస్టులు (Maoists) చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారని గుర్తుచేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని అమాయకుల ప్రాణాలు తీశారని మండిపడ్డారు. దేశంలో న్యాయం రాజ్యాంగం ద్వారా కోర్టులలో మాత్రమే జరుగుతుందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రజాకోర్టుల పేరిట అమాయకులను శిక్షిస్తే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవులలో సొంత సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని మండిపడ్డారు.
అందుకే మావోయిజం పెరిగింది
1970 తర్వాత వ్యాప్తి చెందిన ఒక భావజాలం వల్లే దేశంలో మావోయిజం పెరిగిపోయిందని అమిత్ షా పేర్కొన్నారు. వామపక్ష భావజాలం తీవ్రరూపం దాచి మావోయిజంగా మారిందన్నారు. 2014లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. మోదీ పాలనలో ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమయ్యాయి. ఆర్టికల్స్ 370, 35Aలను తొలగించామన్నారు. రామ మందిరాన్ని నిర్మించామని గుర్తు చేశారు. సీఏఏను చట్టంగా చేశామని చెప్పుకొచ్చారు. నక్సలైట్ల హింసలో నాలుగున్నర వేల మంది పోలీసులు, భద్రతా బలగాలు చనిపోయారని గుర్తు చేశారు. వేలాది మంది వికలాంగులయ్యారని పేర్కొన్నారు. మావోయిస్టులను మానవతావాదులు సమర్ధిస్తారా అంటూ ప్రశ్నించారు. మానవ హక్కుల గురించి మాట్లాడేవారు చనిపోయినవారి పిల్లల గురించి కూడా ఆలోచించాలని పేర్కొన్నారు.
Read Also: కాంట్రవర్సీ కౌశిక్.. ఫ్యూచర్ ఏంటి?
Follow Us On : WhatsApp

