ఏజెన్సీ గర్భిణులకు అందుబాటులో స్కానింగ్ సేవలు..

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ప్రభుత్వ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను (Radiologists) నియమిస్తూ, టిఫా (Targeted Imaging for Fetal Anomalies) వంటి అత్యాధునిక స్కానింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన మాతా-శిశు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో అధికారులు తీసుకున్న చర్యలు ఫలితాలివ్వడం ప్రారంభించాయి. ఇప్పటికే ప్రధాన ఆసుపత్రుల్లో ప్రసూతి వైద్యులను నియమించడం ద్వారా ప్రసూతి సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. ఫలితంగా ప్రతి నెల డెలివరీలు, సిజేరియన్ శస్త్రచికిత్సలు, ట్యూబెక్టమీలు వంటి మాతృసేవలు పెరిగాయి.

ఇక రేడియాలజీ సేవలను మరింత బలోపేతం చేస్తూ, భద్రాచలం, ఎల్లందు, పాల్వంచ, మణుగూరు ఆసుపత్రుల్లో టిఫా స్కాన్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అశ్వారావుపేట, చర్ల ప్రాంతాల్లో రేడియాలజిస్ట్‌ల కొరత ఉండగా, గత కలెక్టర్ జితేష్ పాటిల్, డీసీహెచ్ఎస్ డా. రవి బాబు కృషితో టిఫా యంత్రాలు సమకూర్చారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ అంకిత్ చొరవతో కొత్త రేడియాలజిస్ట్‌ను నియమించి ఈ లోటును కూడా భర్తీ చేశారు.

ఇప్పటివరకు టిఫా స్కాన్ అందుబాటులో లేకపోవడం గర్భిణీలకు ఒక లోటుగా ఉండేది. ఇప్పుడు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో గర్భిణీలు తమ ప్రాంతాల్లోనే పూర్తి స్థాయి మాతృసేవలను పొందగలుగుతున్నారు. గర్భంలోని శిశువు అవయవాల అభివృద్ధిని విశ్లేషించి, పుట్టుకలో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించేందుకు టిఫా స్కాన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది గర్భిణీలకు సకాలంలో సరైన వైద్య నిర్ణయాలు తీసుకునేలా సహాయపడటమే కాకుండా, మాతా-శిశు భద్రతను కూడా పెంచుతుంది. అలాగే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా పేద, గిరిజన గర్భిణీలకు ఈ సేవలు ఎంతో మేలు చేస్తాయని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని డీసీహెచ్ఎస్ డాక్టర్ రవి బాబు తెలిపారు.

Read Also: ఖమ్మం ప్రజలకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ‘యాప్’ ఉంటేనే ఇసుక!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>