కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం, గ్యాస్, క్రూడ్ ఆయిల్ (Crude Oil) కొరతపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కీలక ప్రకటన చేశారు. నేడు పార్లమెంట్ లో మాట్లాడిన నరేంద్ర మోదీ.. పశ్చిమాసియా దేశాలతో భారత్ కు లోతైన వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ‘ఇండియా అవసరాలను పశ్చిమాసియా తీరుస్తోంది. కానీ యుద్ధం ఎప్పుడూ ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. పశ్చిమాసియా యుద్ధం ఆందోళన కరంగా మారింది. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా వెనక్కు తీసుకువస్తున్నాం. 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ లు, హెల్ప్ లైన్ నెంబర్లు అందుబాటులో ఉంచాం. గల్ఫ్ దేశాల్లో కోటి మంది భారతీయులు ఉన్నారు. అక్కడ ఉన్న వారి సంరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 3 లక్షల 75వేల మందిని ఇండియాకు సురక్షితంగా తీసుకొచ్చాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
ఎల్పీజీ, క్రూడ్ ఆయిల్ పై ప్రకటన..
ఈ యుద్ధం వల్ల భారత్ కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని మోదీ తెలిపారు. సమస్యలను అధిగమించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని.. తాను స్వయంగా చాలా దేశాధినేతలతో మాట్లాడినట్టు నరేంద్ర మోదీ వివరించారు. ‘దేశంలో ప్రజలకు పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా చూస్తున్నాం. 60శాతం ఎల్పీజీని భారత్ లో ఉత్పత్తి చేస్తున్నాం. 41 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కొంటున్నాం. ప్రస్తుతం భారత్ వద్ద 53 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోల్ రిజర్వ్ లు ఉన్నాయి. ఆయిల్, ఎల్పీజీ, ఎరువుల నౌకల రాకకు హర్మూజ్ (Strait of Hormuz) కీలకం. హర్మూజ్ నుంచి షిప్ లు సురక్షితంగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) స్పష్టం చేశారు.
భారత్ తో వ్యాపార భాగస్వామ్యం ఉన్న అన్ని దేశాలతో మాట్లాడుతున్నామని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ‘రైల్వే విద్యుదీకరణ వల్ల ఆయిల్ వాడకం తగ్గుతుంది. ఇథనాల్ వాడకం వల్ల ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవచ్చు. ఈ యుద్ధం భారత్ పై ఎన్నో సవాళ్లను విసిరింది. పశ్చిమాసియా వార్ వల్ల ప్రపంచానికే నష్టం వాటిల్లుతోంది. యుద్ధ ప్రభావం దేశ రైతులపై పడకుండా చూస్తున్నాం’ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
Read Also: ఐపీఎల్ ఫ్యాన్ పార్క్స్ 2026 షెడ్యూల్ ఇదే..!
Follow Us On: Facebook

