కలం, వెబ్ డెస్క్: బరువు తగ్గడం అంటే చాలా పెద్ద టాస్క్. దాని కోసం కఠినమైన డైట్ చేయాలి, ఎక్స్‌ర్ సైజ్ చేయాలి. అవి ఎలా చేయాలి? ఎంత మోతాదులో చేయాలో చెప్పడానికి స్పెషల్ ట్రైనర్ కూడా కావాలి. ఆ ట్రైనర్‌కే నెలకు కనీసం రూ.10వేలు అయినా చెల్లించుకోవాలి. ఇది అందరిలో ఉండే భావనే. కానీ ఎప్పుడైనా కృత్రిమ మేధ(AI)ని పర్సనల్ ట్రైనర్‌గా మార్చుకోవాలన్న ఆలోచన మీకు వచ్చిందా? వచ్చినా.. ఏఐ ఏం పని చేస్తుందిలే అని ఆ ఆలోచననే పక్కనపడేసి ఉంటారు. కానీ ఒక వ్యక్తి ఈ ఆలోచనను ఆచరణలో పెట్టి 26 కిలోల బరువు తగ్గారు. అతనే అమీర్ అన్సారీ. తాజాగా తన ట్రాన్స్‌ఫార్మేషన్ వెనుక ఉన్న రహస్యాలను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఎటువంటి జిమ్ లేదా ఖరీదైన యాప్స్ అవసరం లేకుండా, కేవలం క్రమశిక్షణ, ఏడు ప్రత్యేకమైన ప్రాంప్ట్స్‌తో ఈ విజయం సాధించినట్లు ఆయన వెల్లడించారు.
అమీర్ అన్సారీ వాడిన ప్రాంప్ట్స్ ఇవే:
శరీర విశ్లేషణ:
తన బరువు, ఎత్తు, వయసు వివరాలను అందించి, జిమ్ అవసరం లేకుండా 12 వారాల ఫిట్‌నెస్ ప్లాన్ రూపొందించాలని AIని కోరారు. (Body analysis and goal setting)
డైట్ ప్లాన్:
రోజుకు 1800 క్యాలరీలు, 120 గ్రాముల ప్రోటీన్ ఉండేలా తక్కువ ధరలో దొరికే పదార్థాలతో కూడిన మీల్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. (Customised weekly meal plan)
ఇంట్లోనే వ్యాయామం:
ఎటువంటి పరికరాలు లేకుండా ఇంట్లోనే 25-35 నిమిషాల పాటు చేసేలా, 12 వారాల పాటు క్రమంగా కఠినత పెరిగే వర్కవుట్ ప్లాన్‌ను రూపొందించుకున్నారు. (Fat-loss home workouts)
ఆహారపు అలవాట్లపై నియంత్రణ:
అతిగా తినాలనే కోరిక కలిగినప్పుడు 200 క్యాలరీల లోపు ఉండే స్నాక్స్ జాబితాను, మానసిక స్థిరత్వం కోసం ఒక చిన్న స్క్రిప్టును సిద్ధం చేసుకున్నారు. (Craving and emotional eating support)
హ్యాబిట్ ట్రాకింగ్:
ప్రతిరోజూ నిద్ర, వ్యాయామం, భోజనం గురించి ఐదు ప్రశ్నలు అడిగేలా హ్యాబిట్ ట్రాకర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. (Habit tracking system)
మైండ్‌సెట్:
లక్ష్యాన్ని గుర్తు చేస్తూ, కృతజ్ఞతా భావాన్ని పెంచేలా ప్రతిరోజూ ఉదయాన్నే రాసుకునే 5 నిమిషాల జర్నలింగ్ స్క్రిప్టును రూపొందించుకున్నారు. (Mindset and consistency)
వీక్లీ రివ్యూ:
ప్రతి ఆదివారం తన బరువు, నడుము కొలతలను సమీక్షించి, తదుపరి వారానికి అవసరమైన మార్పులను సూచించమని AIని అడిగేవారు. (Weekly review and adjustments)
సాంకేతికతను సరైన పద్ధతిలో వాడుకుంటే పర్సనల్ ట్రైనర్ లేకపోయినా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఈ ఉదాహరణ నిరూపిస్తోంది. ఇక మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోండి. అయితే ఏదైనా ఆన్‌లైన్‌లో చూసి చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని మర్చిపోకండి.

