కలం, తెలంగాణ బ్యూరో : ప్రధాని చేసిన కామెంట్లు కేవలం మాటలకే పరిమితం కాదని, త్వరలో దేశవ్యాప్తంగా ఆచరణలోకి వచ్చే అవకాశాలున్నాయి. దేశంలో పెట్రోలు, డీజిల్ సంక్షోభం (India Fuel Crisis) తీవ్రస్థాయిలో ఉంటుందన్న సంకేతాలున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ఇప్పటికే కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి నర్మగర్భంగా హింట్ ఇచ్చారు. మరో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తాను కాన్వాయ్‌లో ఎస్కార్ట్‌ను తొలగించుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు నీతి ఆయోగ్ సైతం కేంద్ర ప్రభుత్వానికి సంచలన సిఫారసు చేసింది. దేశవ్యాప్తంగా భారీ నిర్మాణాలకు, కూల్చివేతలకు రెండేండ్ల పాటు విరామం ఇవ్వాలని, తాత్కాలిక నిషేధాన్ని విధించాలని సిఫారసు చేసింది. అదే విధానం అన్ని రాష్ట్రాలపైనా రుద్దేందుకు కేంద్రం అడుగులు వేసే అవకాశం ఉంది.
ఆ మూడు బిల్డింగ్స్ కు బ్రేక్..
భారీ నిర్మాణాలకు విరామం ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫారసులపై ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగే కేబినెట్ భేటీలో చర్చ జరిగే చాన్స్ ఉంది. విధాన నిర్ణయానికి సైతం కేంద్రం వెనకడుగు వేయకపోవచ్చు. నీతి ఆయోగ్ సిఫారసులపై కేంద్ర పట్టణాభివృద్ధి అధికారి ఒకరు మాట్లాడుతూ.. సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్త ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించాలనుకున్న ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ వేసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్‌లను కూల్చివేసి అక్కడ కొత్త భవనాలను కట్టే ప్రతిపాదన ఉన్నదని, కానీ వాటి కూల్చివేతకు, కొత్తవాటి నిర్మాణానికి భారీ యంత్రాలను వాడాల్సి ఉంటుందని, డీజిల్ ఇబ్బందుల కారణంగా వీటిని తాత్కాలికంగా ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమే ఇలాంటి నిర్ణయానికి రావడంతో రాష్ట్రాల ప్రతిపాదనలకు సైతం అనుమతుల జారీకి ఇబ్బందులు తప్పకపోవచ్చనే అభిప్రాయం నెలకొన్నది.
బాపూఘాట్, ప్రాణహిత, మెట్రోకు గండం
రాష్ట్ర ప్రభుత్వం మూసీ పునరుజ్జీవన పథకం ఫస్ట్ ఫేజ్‌లో భాగంగా దాదాపు ఏడు వేల కోట్ల ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంతో బాపూఘాట్‌ను నిర్మించాలని డీపీఆర్ సిద్ధం చేసింది. తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు సైతం కేంద్రానికి నివేదికలను పంపి ఆర్థిక సాయం కోరుతున్నది. కానీ ప్రధాని ‘పొదుపు’ మంత్రం నేపథ్యంలో వీటికి ఆమోదం లభించడం, అనుమతులు మంజూరు చేయడం, ఆర్థిక సాయం అందించడం ప్రశ్నార్ధకంగా మారింది. కొవిడ్ టైమ్‌లో ఉన్నప్పటి ఆంక్షలతో పోలిస్తే ఈసారి భిన్నమైన తీరులో పరిమితులు ఏర్పడతాయన్న సంకేతాలు వ్యక్తమవుతున్నది. కేంద్ర మంత్రులే స్వచ్ఛందంగా పెట్రోల్, డీజిల్ విషయాల్లో స్వీయ నియంత్రణ చర్యలు చేపడుతున్నందున రాష్ట్రాలకు భారీ ప్రాజెక్టులకు అనుమతులు రావడం అనుమానమే.
వార్ ఎఫెక్ట్.. ఇల్లు కట్టలేం!
ఇరాన్ వార్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మొదలై రెండునెలలు అవుతున్నది. ముగింపు కోసం ఒక అడుగు ముందుకు పడుతుంటే.. మరో రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఇప్పట్లో అది తేలేలా లేదు. తాజాగా ప్రధాని మోదీ చేసిన ‘పొదుపు’ కామెంట్లు.. వార్ ప్రభావాన్ని స్పష్టం చేస్తున్నాయి. యుద్ధం వల్ల గ్యాస్, పెట్రోల్, డీజిల్ షార్టేజీ ఏర్పడింది. దాని పరిణామ క్రమం నిత్యావసర వస్తువుల ధరలపై పడింది. ఏవి కొందామన్నా భగ్గుమంటున్నాయి. ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే భారీ నిర్మాణాలకు బ్రేక్ వేయడంతో.. సామాన్యులు ఇల్లు కట్టుకునేందుకు అవసరమయ్యే సిమెంట్, సలాకా సహా ముడి సరుకుకు షార్టేజీ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. సిమెంట్, సలాకా వంటి ముడి సరుకు రేట్లు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. చిన్న చిన్న ఇండ్లు కట్టుకోవడానికి ఇప్పుడు పెద్దగా సమస్య ఉండకపోవచ్చని.. అయితే అపార్ట్మెంట్లు, భారీ కట్టడాలకు వాహనాలను వినియోగించాల్సి ఉంటుందని.. డీజిల్ షార్టేజీ వల్ల ఆ వాహనాలు పనిచేయక పనులు ఆగిపోతాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
పెట్రోల్, డీజిల్ పై రేషన్ సిస్టమ్?
ప్రధాని పొదుపు చర్యలతో త్వరలో పెట్రోల్, డీజిల్ విక్రయాలపై రేషన్ విధానాన్ని కేంద్రం అమలు చేయవచ్చన్న ఆందోళన మొదలైంది. ఇదే విషయాన్ని ఆయిల్ సెక్రటరీ నీరజ్ మిట్టల్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదని, అవసరం కూడా ఉండకపోవచ్చని, భయాందోళన అవసరం లేదని వివరణ ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు 60 రోజులకు సరిపడా ఉన్నాయని, ఎల్పీజీ స్టాక్ 45 రోజులకు సరిపోయేంత ఉన్నదని వివరించారు. అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి 67 రోజులుగా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటూ ప్రధాని స్వయంగా పిలుపు ఇవ్వడంతో తొలుత కేంద్ర మంత్రులే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్‌లో ఎస్కార్ట్ లాంటివాటిని తగ్గించుకుని డీజిల్ వినియోగాన్ని నియంత్రించుకుంటున్నారు. దీన్ని ప్రచారంలోకి తెచ్చి ప్రతి ఒక్కరూ పాటించేలా కేంద్రం ఒక నిర్ణయాన్ని ప్రకటించి ఆంక్షలు అమలు చేయవచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి.

