హర్మూజ్ నుంచి మలక్కా వరకు.. ప్రధాన జలసంధులు ఇవే!

కలం, వెబ్​ డెస్క్​ : ప్రపంచ వాణిజ్యానికి సముద్ర మార్గాలు అతిముఖ్యమైనవి. ఒక దేశం నుంచి మరోదేశానికి వస్తువులు, ఇంధనం సరఫరా చేయాలంటే నౌకాయానం కీలకమైనది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలను కనెక్ట్​ చేయడంతో పాటు భౌగోళిక రాజకీయాల్లో కొన్ని జల సంధులు (Straits of The World) కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి సాధారణంగా సముద్రాలు, మహా సముద్రాల్లో సహజంగా ఏర్పడిన ఇరుకైన దారులు. రెండు సముద్రాలు లేదా రెండు భూ భాగాలను కలిపే జల మార్గాలనే జలసంధులు అంటారు. ఇరాన్​ – ఇజ్రాయెల్​ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్​ జలసంధి వార్తల్లో నిలిచింది. ఇరాన్​ ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు హెచ్చరించడంతో భారత్​ తో సహా అనేక దేశాలు భయాందోళనకు గురయ్యాయి. వాణిజ్య సరఫరానే కాకుండా.. రక్షణ వ్యవహారాల్లో ప్రధాన భూమికను పోషిస్తాయి. ఖండాలు, దేశాలను కలుపుతూ.. గ్లోబల్​ ఎకానమీలో ప్రాముఖ్యం ఉన్న ప్రధాన జలసంధుల (Straits of The World) గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

హర్మూజ్​ జలసంధి..

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైన పేరు ‘హర్మూజ్​’ (Hormuz). ఇరాన్​, ఒమన్​, యునైటెడ్​ అరబ్​ ఎమిరేట్స్​ (UAE) సరిహద్దుల్లో ఈ జలసంధి ఉంది. పర్షియన్ గల్ఫ్​​ నుంచి గల్ఫ్​ ఆఫ్​ ఒమాన్​ వరకు ఏకైక మార్గం ఇదే. ప్రపంచ ఆయిల్ వాణిజ్యంలో 20 శాతం, ఆయిల్​ వినియోగంలో 25శాతం  హర్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్​, ఇరాన్​, కువైట్​, యూఏఈ వంటి ప్రధాన ఆయిల్ ఉత్పత్తి దేశాలు హర్మూజ్​ జలసంధి సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశాల నుంచే అమెరికా, ఆసియా, యూరప్​ దేశాలకు ఎగుమతులు అవుతుంటాయి. దీని వల్ల హర్మూజ్ జలసంధి ప్రపంచంలో ప్రముఖమైనది.

మలాక్కా జలసంధి

హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్​ మహాసముద్రంతో మలాక్కా జలసంధి అనుసంధానం చేస్తుంది. ఆసియా ఖండంలోని ఆర్థిక కేంద్రాలైన చైనా, జపాన్​, దక్షిణ కొరియా, ఇండోనేషయాలకు ఇది అత్యంత కీలకమైనది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 25శాతం మలాక్కా జలసంధి ద్వారానే జరుగుతుంది. చైనా, జపాన్​ వంటి దేశాలు ఇక్కడి నుంచే పెట్రోలియం, గ్యాస్​ ఇతర సరుకులను దిగుమతి చేసుకుంటాయి. బౌగోళిక స్థానం కారణంగా ఇది ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా మారింది.

మాగెల్లన్ జలసంధి

దక్షిణ చిలీలో ఉన్న మాగెల్లన్​ జలసంధి అట్లాంటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది. ఫెర్డినాండ్ మాగెల్లన్ అనే పోర్చుగీసు నావికుడు 1520లో దీనిని కనుగొన్న కారణంగా ఈ జలసంధికి మాగెల్లన్​ అనే పేరు వచ్చింది. దక్షిణ అమెరికా ఖండం దక్షిణకొనలో కఠిన వాతావరణంలో ఈ జల సంధి విస్తరించి ఉంది. అయినా చారిత్రకంగా, ఆధునిక కాలంలో మాగెల్లన్​ జలసంధి ముఖ్యమైన మార్గాల్లో ఒకటిగా నిలిచింది. ఇది అంటార్కిటిక్ ప్రాంతాలకు వెళ్లే నావికులకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉంది. ఆధునిక కాలంలో కంటైనర్ షిప్పింగ్, ఆయిల్ ట్యాంకర్లు ఈ మార్గంలో రవాణా చేస్తాయి.

బాస్ జలసంధి

ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఖండం తస్మానియా ద్వీపాన్ని ఆస్ట్రేలియా మెయిన్​ ల్యాండ్​ నుంచి వేరు చేస్తుంది. గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్ (Great Australian Bight) టాస్మన్ సీ (Tasman Sea) మధ్య ఇరుకుగా ఈ మార్గం ఉంటుంది. ఆస్ట్రేలియా ఆర్థిక వ్వయస్థకు చాలా ముఖ్యమైన జలసంధి బాస్​ జలసంధి. తస్మానియా, ఆస్ట్రేలియాకు మధ్య జరిగే రవాణాలో కీలక భూమిక పోషించే ఈ జలసంధిలో ఆయిల్, గ్యాస్ నిల్వలు, సముద్ర వనరులు సమృద్ధిగా ఉన్నాయి.

బాస్పరస్ జలసంధి

ఇస్తాంబుల్​ నగరం గుండా నల్ల సముద్రం, మర్మరా సముద్రం వరకు విస్తరించి ఉన్న బాస్పరస్​ జలసంధి యూరప్ మరియు ఆసియా ఖండాలను వేరు చేస్తుంది. అంతర్జాతీయ జలమార్గానికి అత్యంత ముఖ్యమైనది. రష్యా, ఉక్రెయిన్, రోమానియా వంటి బ్లాక్ సీ దేశాల నుంచి మెడిటరేనియన్, ప్రపంచ మార్కెట్లకు సరుకు రవాణా ఇక్కడి ద్వారానే సాగుతుంది. ఇస్తాంబుల్ నగరం ఈ జలసంధి ఇరువైపులా ఉండటంతో ఇది చారిత్రకంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా టర్కీకి కీలకమైనది. సముద్ర రవాణా ఎక్కువగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నందున టర్కీ ప్రభుత్వం కొత్త కాలువలు నిర్మించాలని యోచిస్తోంది.

సింగపూర్​ జలసంధి

ఈ జలసంధి సింగపూర్​, మలేషియా మధ్య విస్తరించి ఉంది. ఇది మలాక్కా జలసంధి నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు వ్యాపించి ఉంది. అత్యంత రద్దీగా ఉండే జలమార్గాల్లో ఇది కూడా ఒకటి. మలాక్కా-సింగపూర్ రూట్ అని పిలవబడే ఈ మార్గం ఆసియా వాణిజ్యానికి రక్తనాళం వంటిది. రోజు వేలాది కంటైనర్ షిప్పింగ్, ఆయిల్ ట్యాంకర్లు, బల్క్ కార్గోలు ఇక్కడి ద్వారా ప్రయాణిస్తాయి. సింగపూర్ ఆర్థిక వ్యవస్థకు ఈ జలసంధి వెన్నుదన్నుగా ఉంది.

బెరింగ్ జలసంధి

రష్యా, అలాస్కా మధ్య ఉన్న బెరింగ్​ జలసంధి అర్కిటిక్​ మహాసముద్రం నుంచి పసిఫిక్​ మహాసముద్రం వరకు ఏకైక జలమార్గంగా ఉంది. ఆసియా, ఉత్తర అమెరికా ఖండాలను వేరు చేస్తుంది. చాలా చల్లని వాతావరణం, మంచు కప్పి ఉన్నప్పటికీ మార్పుల వల్ల ఐస్​ కరిగిపోతుంటుంది. రష్యా, అమెరికా మధ్య సైనిక, వాణిజ్య ప్రాముఖ్యతను కలిగి ఉన్న జలసంధి.

జిబ్రాల్టర్ జలసంధి

స్పెయిన్​, మొరాకో మధ్య ఉన్న జిబ్రాల్టర్​ జలసంధి అట్లాంటిక్​ మహాసముద్రాన్ని మెడిటరేనియన్​ సీ తో అనుసంధానం చేస్తుంది. యూరప్​, ఆఫ్రికా ఖండాలను విడదీస్తుంది. యూరప్ నుంచి ఆఫ్రికా, ఆసియాకు జరిగే వాణిజ్యంలో అత్యంత ప్రాచీనమైన, కీలక మార్గం. యూరప్ దేశాలు, ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల మధ్య సరుకు రవాణా ఇక్కడి ద్వారానే జరుగుతుంటుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>