కలం, వెబ్ డెస్క్: ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వృథాను అరికట్టి (Save Electricity) స్వయం సమృద్ధి, పర్యావరణ హితమైన పాలన అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న చర్యలు చేపడుతోంది. విద్యుత్ సద్వినియోగంతో స్థిరమైన పట్టణాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నిలపాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. మున్సిపల్ భవనాలు, నీటి సరఫరా, సివేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లలో విద్యుత్ వృథాను తగ్గించేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టారు. ఆటోమేటిక్ టైమర్స్ , ఎల్డిఆర్ (LDR) సెన్సర్ల సాంకేతికతతో వీధి దీపాల్లో విద్యుత్ ఆదా చేయడమే కాకుండా తద్వారా ఖర్చుల తగ్గింపు జరిగేలా చర్యలు తీసుకుంది.
అటు రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు మున్సిపల్ వాహనాలు, ఘన వ్యర్థాల నిర్వహణ వాహనాలు, వాటర్ ట్యాంకర్ల స్థానంలో పర్యావరణ అనుకూల ఈవీ (EV) వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేస్తూ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సాంకేతిక ఆధారిత చర్యలతో స్థిరమైన, స్వయం సమృద్ధి పట్టణ పాలన సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం కోరుతోంది.

