Mobile Popup Ad
Mobile Popup Ad

నిషేధమున్నా.. వరంగల్ లో ఆగని గుట్కా దందా !

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లాలో గుట్కా దందా జోరుగా కొనసాగుతోంది. గుట్కా అమ్మకాలపై నిషేధం ఉన్నా విక్రయాలు ఆగడం లేదు. సిండికేట్ గా ఏర్పడిన వ్యాపారులు యథేచ్ఛగా అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టాల్సిన పోలీసులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు తావిస్తోంది.

వరంగల్ పిన్నవారి స్ట్రీట్ లో ..

వరంగల్ నగరంలోని పిన్నవారి స్ట్రీట్, ఖిలా వరంగల్ (Warangal) లోని హనుమాన్ బొమ్మ దగ్గర గుట్కా వ్యాపారం జోరుగా నడుస్తోంది. పిన్నవారి స్ట్రీట్ లోని మహాలక్ష్మి, గోల్డెన్, ఉత్తమ్, ప్రకాష్ బ్రదర్స్ జనరల్ స్టోర్స్ గుట్కా వ్యాపారాలకు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి రోజువారీగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయల వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. ఈ దుకాణాల సముదాయాల సమీపంలోనే ఇంతేజార్ గంజ్, మట్టెవాడ పోలీస్ స్టేషన్లు ఉన్నప్పటికీ, అటువైపు కన్నెత్తి చూసే వారే లేరనే విమర్శలు ఉన్నాయి.

మహారాష్ట్ర నుంచి రవాణా

గుట్కా, పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్నా తినేవాళ్లు మానడం లేదు. దొంగచాటుగా తెచ్చి బ్లాక్‌ లో అమ్మితే లాభం అధికంగా ఉండడంతో వ్యాపారులు అడ్డు అదుపు లేకుండా అక్రమ వ్యాపారానికి తెరలేపారు. మహారాష్ట్ర లోని సోలాపూర్, నాందేడ్ నుంచి బస్సుల్లో, లారీల్లో వరంగల్‌ కు గుట్కా రవాణా అవుతున్నట్లు సమాచారం. చెక్‌ పోస్ట్‌ ల వద్ద సరైన నిఘా లేకపోవడంతో అక్రమ వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతోంది. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నారు. 2025 డిసెంబర్ లో హంటర్ రోడ్, మండి బజార్ ఏరియాలో టాస్క్ ఫోర్స్ దాడులు చేసి సుమారు రూ. 2.5 లక్షల విలువైన గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లను సీజ్ చేసింది. ఆ తర్వాత 2026 జనవరిలో కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర సోలాపూర్ నుంచి వస్తున్న లగేజీలో రూ. 4 లక్షల విలువైన గుట్కాను పట్టుకొని, ఇద్దరిని అరెస్ట్ చేశారు. 2026 మార్చిలో వరంగల్ పోచమ్మ మైదాన్ లోని ఒక గోడౌన్‌ పై రైడ్ చేసిన పోలీసులు రూ. 6 లక్షల స్టాక్ సీజ్ చేసి, సదరు వ్యక్తి పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.

పట్టించుకోని పోలీసులు

ఈ ఏడాది మార్చి 31న వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గుట్కా, గంజాయి లాంటి నిషేధిత పదార్థాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అదే విధంగా హనుమకొండ కలెక్టర్ సైతం గుట్కా అమ్మితే పీడీ యాక్ట్ పెడతాం, షాప్ సీజ్ చేస్తామని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో కేసులు దాఖలైన ఘటనలు లేవని తెలుస్తోంది. అధికారులు మామూళ్ల మత్తులో ఉంటూ పట్టించుకోవడం లేదని స్థానికంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు దాడులు చేసినట్లు ఫోటోలకు పోజ్ ఇచ్చి వదిలేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గుట్కా విక్రయాలను పూర్తి స్థాయిలో అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>