కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నల్లమట్టి అక్రమ తరలింపు దందా (Illegal Black Soil Transport) మూడు జేసీబీలు ఆరు లారీలు అన్న చందంగా సాగుతోంది. నందిపేట్ మండలం పరిధిలోని ఎస్సారెస్పీ ప్రాంతంలో రైతుల ముసుగులో ఎలాంటి అనుమతులు లేకుండా నల్ల మట్టి కొల్లగొడుతున్నారు. అధికారులు నామమాత్రంగా ఒకట్రెండు లారీలు సీజ్ చేసి మట్టి మాఫియాకు అండగా ఉంటున్నారని స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్లకు స్కానర్లు ఏర్పాటు చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
అనుమతి ట్రాక్టర్లకు.. తరలుతున్నది టిప్పర్లలో
శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో ఉన్న పూడిక నల్లమట్టి వ్యవసాయ భూములకు సారవంతంగా మార్చడానికి ఉపయోగ పడుతోంది. అందులో భాగంగా రైతులు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లేందుకు ఏటా అన్నదాతలకు అనుమతి ఇస్తారు. ఈసారి కూడా అనుమతినిచ్చారు. ప్రాజెక్టు ఉన్న ప్రాంతాల్లో ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల పరిధిలోని పంచగూడ, అన్నారం, కొండూరులలో ట్రాక్టర్లు ఏమో గానీ అధిక లోడుతో టిప్పర్‌లలో మాత్రం నల్లమట్టి తరలుతోంది. రోజూ అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా నల్ల మట్టి పెద్ద ఎత్తున అక్రమ రవాణా అవుతున్నది.
వీడీసీలకు లంచాలు
గ్రామాలలోని వీడీసీలను మచ్చిక చేసుకుని రూ.2 వేలు లంచాలు ఇచ్చి రోజువారీగా చెల్లిస్తూ ధనార్జనే ధ్యేయంగా పని కానిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు జిల్లా దాటి సుదూర ప్రాంతాలకు సైతం ఓవర్ లోడ్‌తో లారీలలో మట్టిని చేరవేస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఆర్మూర్ సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు నల్లమట్టి తరలిస్తున్న పది లారీలను అధికారులు పట్టుకున్నారు. అలాగే రెండు రోజుల ముందు రాత్రి వేళలో నల్ల మట్టిని తరలిస్తున్న నాలుగు లారీలను సీట్ చేశారు. క్యూఆర్ కోడ్ ఆధారంగా ఏ ప్రాంతానికి ఏ రైతుకు, ఎంత మట్టి అవసరం ఉందో వారి రైతులు వివరాలను పొందుపరుస్తూ మట్టిని తరలిస్తున్నారని అధికారులు చెబుతున్నారు.
పాస్ బుక్ రైతుదే కానీ..
వాస్తవానికి పట్టా పాస్ బుక్ ఏదైనా రైతుది మధ్యవర్తులు తీసుకువచ్చి తమ మట్టి దందాను సుగమం చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ అంటూ మట్టి దందాను అరికట్టేందుకు చేస్తున్న పట్టా పాస్ బుక్ దారు సమర్పించిన సంబంధిత పట్టా భూమి లోకి నల్ల మట్టి వెళ్తుందా లేదా అనేది అధికారులు ఆలోచించడం లేదు. నిజానికి మట్టి రైతుకు అవసరమైతే చలాన్ రూపంలో ప్రభుత్వానికి కొంత రుసుము చెల్లించి అధికారులను సమన్వయం చేస్తూ మధ్యవర్తులను అరికట్టి రైతులకు మేలు చేయాలని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జనాలు పలు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

