Mobile Popup Ad
Mobile Popup Ad

సింగపూర్ ఓపెన్‌లో ప్రణయ్ సంచలనం.. వరల్డ్ నెం.5పై గెలుపు

క‌లం, వెబ్‌డెస్క్‌: సింగపూర్ ఓపెన్ రెండో రోజు భారత్‌కు అదిరిపోయే విజయం దక్కింది. భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ (HS Prannoy) ప్రపంచ ఐదో ర్యాంకర్, ఇండోనేషియా ఆటగాడు జోనాథన్ క్రిస్టీ (Jonatan Christie)పై సంచలన విజయం సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లారు. 61 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో ప్రణయ్ 10-21, 21-12, 21-18 తేడాతో విజయం జెండా ఎగరవేశారు. గత రికార్డుల ప్రకారం క్రిస్టీకి ప్రణయ్‌పై 7-3 ఆధిక్యం ఉంది.

దానికి తగ్గట్టే ఈ మ్యాచ్ తొలి గేమ్‌ను క్రిస్టీ సులభంగా గెలుచుకున్నారు. అయితే మాజీ ప్రపంచ ఆరో ర్యాంకర్ అయిన ప్రణయ్ రెండో గేమ్‌లో గట్టిగా పుంజుకున్నారు. స్కోరు 2-2తో సమమైన తర్వాత మ్యాచ్‌ను తన అదుపులోకి తెచ్చుకుని, 21-12తో ఆ గేమ్‌ను సొంతం చేసుకున్నారు. ఇక విజేతను నిర్ణయించే మూడో గేమ్ ఉత్కంఠ భరితంగా సాగింది. మొదట్లో క్రిస్టీ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చివరి నిమిషంలో ప్రణయ్ పుంజుకున్నారు.

ఒక దశలో 16-18తో వెనుకబడిన భారత ప్లేయర్, వరుసగా ఐదు పాయింట్లు సాధించి 21-18తో మ్యాచ్‌ను ముగించారు. ప్రణయ్ తన తదుపరి రౌండ్-16 మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన లో కీన్ యూతో తలపడనున్నారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో లో కీన్ యూ భారత్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్‌ను 22-20, 19-21, 21-17తో ఓడించారు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్ కపిల, తనీషా క్రాస్టో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.

మలేషియాకు చెందిన వాంగ్ తియెన్ సి, లిమ్ చివ్ సియన్‌లపై 21-14, 20-22, 21-13తో వీరు విజయం సాధించారు. తొలి గేమ్‌ను భారత్ గెలవగా, రెండో గేమ్‌ను మలేషియా జోడీ కైవసం చేసుకుంది. చివరి గేమ్‌లో స్కోరు 7-6 ఉన్నప్పుడు ధ్రువ్, తనీషా జోడీ విజృంభించి 58 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించింది. ఇక మహిళల సింగిల్స్‌లో భారత ప్లేయర్ మాళవిక బన్సోద్ గట్టిగా పోరాడి ఓడిపోయారు. లిన్ హసియాంగ్ తి చేతిలో 21-11, 19-21, 12-21 తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>