కలం, వెబ్ డెస్క్: కల్తీ బేకరీ ఫుడ్స్ తయారు చేసి హైదరాబాద్ నగరంలోని వివిధ బేకరీలకు సరఫరా చేస్తున్న ఓ యూనిట్ (Illegal Bakery)ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకొని రూ. 12.54 లక్షల విలువైన అనారోగ్యకర ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం గుడిమల్కాపూర్ పోలీసులతో కలిసి కేడీ కాలనీలో నడుస్తున్న అక్రమ బేకరీ తయారీ యూనిట్‌పై దాడి చేసింది. ఈ సందర్భంగా అనుమతి లేకుండా, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న అహ్మద్ రజా (46) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
దాడుల్లో భాగంగా పెద్ద మొత్తంలో ముడి సరుకులు, బిస్కెట్లు, బన్స్, రస్క్ వంటి తయారైన బేకరీ ఉత్పత్తులు, యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ రూ.12,54,280గా అధికారులు వెల్లడించారు.
అనుమతి లేకుండా తయారు చేసిన ఈ అనారోగ్యకర ఉత్పత్తులను స్థానిక దుకాణాలు, కేఫేలు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే విధంగా ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

