కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలోని సత్తుపల్లి (Sathupally) మండలం కిష్టారంలో ఆదివారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ ఇంట్లో సాగుతున్న వ్యభిచార గృహ నిర్వహణపై కిష్టారం గ్రామ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జరిగిన వివాదం కాస్తా కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇద్దరు గ్రామ పెద్దలు తీవ్రంగా గాయపడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బంధువులు, పోలీసుల వివరాల ప్రకారం.. సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరువూరు మండలానికి చెందిన నాగమణి, హనుమంతరావు దంపతులు ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు స్థానికులకు సమాచారం అందింది. గ్రామ పరిసరాల్లో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం సరైంది కాదని భావించిన కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి అక్కడికి వెళ్లారు.
వెంటనే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆ దంపతులను వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాటమాట పెరిగి ఘర్షణ తీవ్రం కావడంతో, ఆగ్రహానికి లోనైన నాగమణి, హనుమంతరావు దంపతులు కొబ్బరి బొండాలు నరికేందుకు ఉపయోగించే కత్తితో గ్రామ పెద్దలపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావులకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందించగా, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అనంతరం వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగమణి, హనుమంతరావు దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే, ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న కొత్తగూడెంకు చెందిన సోని అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై వియం బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, గ్రామ పరిసరాల్లో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

