కలం, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరిగిన యోగా వేడుకల్లో పాల్గొన్న నటి శ్రీలీల (Sreeleela)కు చేదు అనుభవం ఎదురైంది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ (Amruta Fadnavis) శ్రీలీలతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోటోలు దిగుతున్న సమయంలో అమృత శ్రీలీలను పక్కకు వెళ్లమని చెప్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు, శ్రీలీల ఫ్యాన్స్ అమృత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ముందు అమృత, ఆమె కుమార్తె, శ్రీలీల కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఆ తర్వాత జర్నలిస్టులు అమృత, ఆమె కుమార్తె ఫొటోలను మాత్రమే అడగ్గా.. అమృత శ్రీలీలను వేలు చూపిస్తూ పక్కకు వెళ్లాలని చెప్పింది.
శ్రీలీల వెంటనే అక్కడి నుంచి పక్కకు వెళ్లి నిలుచుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది నెటిజన్లు అమృత ఇలా ప్రవర్తించాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు. అలా వేలు పెట్టి చూపడం ఏమిటని, నవ్వుతూ చెప్పాల్సింది అని చెప్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ఫోటో సెషన్‌లో జరిగిన ఇన్సిడెంట్ అని, సెలబ్రెటీలు హాజరయ్యే ఇలాంటి వేడుకల్లో ఇది సాధారణమేనని అంటున్నారు.

