కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌ను పాకిస్తాన్ బాయ్ కాట్ చేయనుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐసీసీ.. పీసీబీ (PCB)కి స్ట్రాంగ్ వార్నింగ్ (ICC Warns Pakistan) ఇచ్చింది. టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. అయితే, పొట్టి ప్రపంచ కప్ నుంచి టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటిస్తూ బంగ్లా స్థానంలో స్కాట్లాండ్ కు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
భద్రతా కారణాలతో భారత్ లో ఆడలేమని, తాము ఆడే మ్యాచ్ ల వేదికలు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.. ఐసీసీకి లేఖ రాసింది. దీనిపై స్పందించిన ఇంటర్నెషనల్ క్రికెట్ బోర్డు ఎట్టి పరిస్థితుల్లోనూ వేదికల మార్పు ఉండబోదని స్పష్టం చేసింది. దీనిపై నిర్ణయం తెలపాలని బీసీబీని కోరింది. గడువు లోపు బంగ్లా నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
బంగ్లాదేశ్ ను టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో అదే దారిలో పాకిస్తాన్ నడవనున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ హింట్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ కు అన్యాయం జరిగిందని, ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది అని ఆరోపించారు. తాము కూడా ప్రపంచకప్ ను బాయ్ కాట్ చేస్తామంటూ మాట్లాడారు. దీనిపై ఐసీసీ స్పందిస్తూ పాక్ కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వెళ్లిపోతే తీవ్ర ఆంక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది.
ఒకవేళ పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగితే ఐసీసీ తీవ్రంగా స్పందించే అవకాశాలున్నాయని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. ఐసీసీ పరిశీలనలో ఉన్న ఆంక్షల్లో ప్రధానంగా ఉన్నవి.. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో విదేశీ ఆటగాళ్లకు అనుమతి ఇవ్వకపోవడం. ఐసీసీ నిధులు తగ్గించం. ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ను తొలగించడం.
పాక్ లో నిర్వహించే అన్ని ద్వైపాక్షిక సిరీస్ లను రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆర్థిక నష్టాల పాలయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే పెనం నుంచి పొయిలో పడ్డట్టుగా దాయాది దేశం పరిస్థితి దిగజారుతుంది. టీ20 ప్రపంచ కప్ పై పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది.



