కలం, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam) మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక (municipal chairman election) శనివారం జరుగనుంది. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మ.12.30 గంటలకు ఇబ్రహీంపట్నం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ కారణంగా 2 సార్లు ఎన్నిక వాయిదా పడింది. కోర్టు ఆదేశాలతో ఎన్నిక నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్‌కు 13, బీజేపీకి ఒక్కరు, స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున 8 మంది గెలిచారు. ఎలాంటి గొడవ జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నిక సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జి. సుధీర్ బాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారతీయ నాగరిక్ సురక్ష చట్టం (బిఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 ప్రకారం.. “ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిషేధాలు అమలులో ఉంటాయని చెప్పారు. ఎన్నికలు వాయిదా పడినట్లయితే, ఈ ఆంక్షలు ఈ నెల 5న కూడా కొనసాగుతాయని వివరించారు. ఐదుగురు మందికి పైగా గుమికూడడం నిషేధం, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధమని..ఈ ఉత్తర్వులను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేడు క్యాతనపల్లి,ఖానాపూర్ మున్సిపల్ ఆఫీస్‌లో ఎన్నిక
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో శనివారం చైర్‌పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు క్యాతనపల్లిలో భారీగా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో నిర్వహణకు ఏర్పాట్లు చేసేలా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్, సీఐ రమేష్, తహసీల్దార్ సతీష్, మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్‌తో మాట్లాడి సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కౌన్సిలర్లకు సమయానికి నోటీసులు అందించాలని చెప్పారు.

