కలం, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవి (iBomma Ravi) కేసు వ్యవహారంలో రోజుకో విషయం భయటపడుతున్నది. ఈ కేసుకు సంబంధించి నిందితుడు రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, విచారణలో విస్తుపోయే విషయాలను వెలుగులోకి తెచ్చారు. సోమవారం దీనికి సంబంధించిన వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు మీడియాకు వెల్లడించారు.
నిందితుడు రవి తన ముగ్గురు స్నేహితుల పేర్ల మీద ఫేక్ ఐడీలను సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. తన కార్యకలాపాలను గోప్యంగా ఉంచేందుకు ఇతరుల గుర్తింపు కార్డులను వాడుకున్నట్లు విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రవికి చెందిన రూ.3 కోట్ల నగదును పోలీసులు ప్రస్తుతం ఫ్రీజ్ చేశారు.
ఐ బొమ్మ కార్యకలాపాల వెనుక ఉన్న అంతర్జాతీయ మూలాలపై పోలీసులు దృష్టి సారించారు. ముఖ్యంగా కరేబియన్ దేశంలో ఉన్న ఐబొమ్మ రవి (iBomma Ravi)కి సంబంధించిన డేటా గురించి ఆరా తీస్తున్నారు. కేవలం సినిమా పైరసీ మాత్రమే కాకుండా, వివిధ బెట్టింగ్ యాప్స్‌తో రవికి ఉన్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర పైరసీ వెబ్‌సైట్‌లతో కూడా ఇతనికి ఏవైనా లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఈ కేసులో భాగంగా రవి స్నేహితుడు ప్రహ్లాద్‌ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. అయితే తనకు రవితో ఎటువంటి సంబంధాలు లేవని ప్రహ్లాద్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. నిందితుడు ఐడీలు వాడుకున్న మిగతా ఇద్దరు స్నేహితులను కూడా త్వరలోనే విచారణకు పిలవనున్నట్లు డీసీపీ తెలిపారు.
పైరసీపై ఇకపై కఠిన చర్యలు ఉంటాయని డీసీపీ అరవింద్ బాబు హెచ్చరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పైరసీకి పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, చట్టపరంగా వారిపై కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


