కలం, వెబ్ డెస్క్ : అక్రమణల తొలగింపుల విషయంలో హైడ్రా (HYDRAA) దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో కోకాపేట కొత్త చెరువులో రహదానికి ఆక్రమించి నిర్మించిన షెడ్డులను తొలగించింది. రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలం, కోకాపేట గ్రామంలోని కొత్త చెరువు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఎఫ్‌టీఎల్ పరిధిలో దాదాపు 1.20 ఎకరాల వరకూ ఆక్రమించి గోల్డ్ ఫిష్ విల్లాస్ కోసం ప్లే ఏరియాలు, పార్కుల నిర్మాణం చేపట్టారు.
అలాగే మరో 20 ఎకరాల మేర పలు నిర్మాణ సంస్థలు కబ్జా చేశాయి. ఈ నేపథ్యంలో చెరువును కాపాడాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా పరిశీలించింది. మంగళవారం రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణలు తొలగించింది. చెరువు హద్దులు నిర్దారించి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తోంది.
అలాగే, కూకట్‌పల్లి మండలం ఖైతలాపూర్‌లో రహదారి ఆక్రమణలపై హైడ్ర దృష్టి సారించింది. జ్యువల్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ముందు 1700ల గజాల మేర రహదారిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించింది.

