కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో ఎండాకాలం నీటి కొరతతో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతావుతాయో అందరికి తెలిసిందే. ఈ తరుణంలోనే నగరంలోని పేద ప్రజలకు సరఫరా అయ్యే నీళ్ల నల్లాలపై జలమండలి (Hyderabad Water Board) దృష్టి సారించింది. జీహెచ్ఎంసీతో పాటు ORR వరకు విస్తరించిన హైదరాబాద్ కు జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్ల (Illegal Motors Attached) బిగించుకొని అక్రమంగా నీటిని వాడుతున్నట్లు జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. దీని వల్ల మిగిలిన వినియోగదారులకు లో- ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతోంది. నల్లాలకు మోటార్లు బిగించడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ జలమండలి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజాగా నగరంలో పైపులైనుకు నేరుగా విద్యుత్ మోటార్లు బిగించి నీటిని అక్రమంగా తోడుతున్న మోటార్లను అధికారులు సీజ్ చేసారు. బుధవారం రోజున ఓ అండ్ ఎం డివిజన్ నంబర్-6, ఎస్ఆర్ నగర్ పరిధిలోని ఎస్ఆర్టి కాలనీలో నల్లాకు మోటార్లు బిగిస్తున్నారని స్థానికులు జలమండలి విజిలెన్సు అధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన అధికారులు నీటి సరఫరా సమయంలో పర్యటించి పైపులైనుకు అక్రమంగా బిగించిన 7 మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తామని హెచ్చరించారు. రెండోసారి మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తక్కువ ప్రెజర్ తో నీరు సరఫరా అయినా లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలన్నారు. జలమండలి కస్టమర్ కేర్ నంబరు 155313 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
Read Also: భర్తను వదిలి ప్రియుడి చెంతకు: హైకోర్టు కీలక తీర్పు!
Follow Us On: Youtube

