Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం సీటుపై హరీశ్ రావు కన్ను.. ఎంపీ చామల కామెంట్

కలం, నల్లగొండ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) విఫలయత్నం చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) విమర్శించారు. బుధవారం గాంధీ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ఎప్పటికీ అధికారం కోల్పోదని హరీశ్ రావు కలలు కన్నారని, కేసీఆర్ తర్వాత తానే ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారని చామల ఎద్దేవా చేశారు. ‘‘కేటీఆర్ వల్ల ఏమీ కాదని భావించిన హరీశ్ రావు సీఎం సీటుపై కన్నేశారు. కానీ ప్రజలు వారిని పక్కన పెట్టారు” అని అన్నారు.

2014, 2018 మేనిఫెస్టోల్లో బీఆర్ఎస్ (BRS) ఇచ్చిన వాగ్దానాలపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన వెంటనే అదే అంశంపై బీజేపీ నేతలు గొంతు కలపడం వారి మధ్య ఉన్న అవగాహనకు నిదర్శనమని పేర్కొన్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని, నల్లధనం వెలికితీస్తామన్న హామీ ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించారు. “దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి మోసం చేసింది బీఆర్ఎస్ కాదా? ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారు? ఎంతమంది దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేశారు?” అని చామల (MP Chamala) నిలదీశారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ కనీసం 30 శాతం హామీలను కూడా అమలు చేయలేదని, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదేళ్లుగా ఎంపీగా ఉండి ఏం చేశారని చామల ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీని అడ్డుకోలేకపోయినందునే ప్రజలు బీజేపీని కాదని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్నారు. కేవలం పత్రికల్లో పేరు కోసమే బండి సంజయ్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని చామల మండిపడ్డారు.

Read Also: బీఆర్ఎస్ కుట్రలకు బలికావొద్దు.. వికారాబాద్ రైతులకు శ్రీధర్ బాబు రిక్వెస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>