కలం, వెబ్ డెస్క్: ఎండాకాలం తాగునీటి సమస్యల దృష్ట్యా హైదరాబాద్ (Hyderabad) వాసులకు జలమండలి కీలక సూచనలు చేసింది. వేసవిలో తాగునీటి సమస్యలను అధిగమించేందుకు ప్రతి పౌరుడు నీటిని వృధా చేయకుండా నీటి పొదుపు చర్యలను పాటించాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, నగర పరిధిలో భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో తాగునీటి డిమాండ్ పెరుగుతున్నందున ప్రతి పౌరుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞపి చేశారు. ప్రతి కుటుంబం కనీసం 20 శాతం వరకు నీటిని ఆదా చేయాలని సూచించారు. చిన్నచిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మొత్తంలో నీటిని సంరక్షించవచ్చని చెప్పారు. ఇప్పటికే వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి తాము చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రజల సహకారం అత్యవసరమని స్పష్టం చేశారు. నీరు అమూల్యమైన వనరు అని.. ప్రతి చుక్కను విలువైనదిగా భావించి వినియోగిస్తేనే భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించగలమని అభిప్రాయపడ్డారు.
పౌరులకు జలమండలి ముఖ్య సూచనలు:
1. విలువైన తాగునీటిని వాహనాల శుభ్రపరిచేందుకు, ఇళ్ల పరిసరాలను కడగడానికి ఉపయోగించరాదు.
2. బ్రష్ చేసేటప్పుడు నల్లా (ట్యాప్) నిరంతరం తెరిచి ఉంచకుండా, మగ్గులో నీరు తీసుకుని వినియోగించాలి.
3. స్నానం చేసేటప్పుడు షవర్ వినియోగాన్ని తగ్గించి, బకెట్ నీటితో స్నానం చేయడం ద్వారా గణనీయంగా నీటిని ఆదా చేయవచ్చు.
4. లీకేజీలు ఉన్న పైపులు, ట్యాపులు వెంటనే మరమ్మతులు చేయించుకోవాలి.
5. అవసరానికి మించి నీటిని నిల్వ చేయడం, వృథా చేయడం నివారించాలి.

