కలం, క్రైమ్ బ్యూరో : మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను తోడేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎంత అవగాహన కల్పించినా, ఎన్నిసార్లు జరిమానాలు విధించినా.. చివరకు జైలు శిక్షలు విధించినా వాహనాలు నడిపే మందుబాబుల్లో మాత్రం మార్పు రావడం లేదు. హైదరాబాద్ (Hyderabad), సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk Drive) తనిఖీల్లో 1000 మందికి పైగా వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్‌లో మే 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నగరంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 475 మంది వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో 397 మంది ద్విచక్రవాహనదారులు ఉండగా, 36 మంది ఆటో డ్రైవర్లు, 42 మంది కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 293 మంది వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు. వీరిలో 241 మంది ద్విచక్ర వాహనదారులు ఉన్నారు.
మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. మే 24వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 268 మంది వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.
పట్టుబడితే జైలు తప్పదు
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ పట్టుబడితే జైలు శిక్ష తప్పదని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయటం తీవ్రమైన నేరమని ,మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత –2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్ట శిక్ష 10 ఏళ్ల జైలు, జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు.

