కలం, హెల్త్: కంటి ఆరోగ్యంపై హైదరాబాద్ (Hyderabad) శాస్త్రవేత్తలు ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. మన కంటికి సోకే ఇన్ఫెక్షన్లలో (Eye Infections) దాదాపు సగం మందికి ప్రస్తుతం వాడుతున్న మందులు అస్సలు పనిచేయడం లేదని తేల్చి చెప్పారు. సీసీఎంబీ, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా జరిపిన ఈ అధ్యయనంలో.. కంటిపై దాడి చేస్తున్న బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం వైద్యులతో పాటు రోగులను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రోగుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా, 45 శాతానికి పైగా బ్యాక్టీరియాలు ‘మల్టీ డ్రగ్ రెసిస్టెంట్’గా మారాయని వెల్లడైంది. అంటే వీటిపై ఒకటి కంటే ఎక్కువ రకాల మందులు కూడా ప్రభావం చూపలేవు. ముఖ్యంగా మనం తరచుగా వాడే ‘ఫ్లోరోక్వినోలోన్’ యాంటీబయాటిక్స్‌ను ఈ క్రిములు సులువుగా పక్కకు నెట్టేస్తున్నాయి. స్టెఫిలోకాకస్ వంటి భయంకరమైన స్ట్రెయిన్లు చర్మం నుంచి కంటికి చేరి, అక్కడ తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
షాకింగ్ అనాలసిస్
హోల్-జెనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ క్రిముల గుట్టును శాస్త్రవేత్తలు విప్పారు. ఈ బ్యాక్టీరియాలు తమ డిఎన్ఏను మార్చుకుంటూ కొత్త రూపాల్లోకి రూపాంతరం చెందుతున్నాయని, ఈ సమాచారం కేవలం కంటి వ్యాధులకే కాకుండా శరీరంలోని ఇతర ఇన్ఫెక్షన్ల చికిత్సకు కూడా పెద్ద సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు జరిపిన ఈ సమగ్ర విశ్లేషణ, భవిష్యత్తులో రాబోయే పెను ప్రమాదానికి సూచికగా నిలుస్తోంది.
చికిత్స విషయంలో పాత పద్ధతులు ఇకపై చెల్లవని, మైక్రోబయాలజీ పరీక్షల ఆధారంగా మాత్రమే మందులు వాడాలని నిపుణులు తేల్చి చెబుతున్నారు. లేదంటే ఇన్ఫెక్షన్ (Eye Infections) తగ్గకపోగా మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ అధ్యయనం మన చుట్టూ ఉన్న వాతావరణంలో బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరంగా మారుతుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, సొంత వైద్యం మానుకొని నిపుణులైన కంటి వైద్యుల సలహాలు తీసుకోవడమే సురక్షితమని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read Also: నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయా?
Follow Us On: Instagram

