కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో కురుస్తున్న భారీ వర్షం (Rain) బీభత్సాన్ని సృష్టించింది. నగర వ్యాప్తంగా పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. ఇక ట్రాఫిక్ ఇబ్బందులు తారా స్థాయికి చేరుకున్నాయి. పాత బస్తీలో పురాతన ఛత్తా బజార్ కమాన్ కుప్పకూలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలులు, వర్షాల ఎఫెక్ట్‌తో పలు చోట్ల కరెంట్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. చాంద్రాయణగుట్ట (Chandrayangutta)లో రోడ్డుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అబు, జాఫర్‌లుగా గుర్తించారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం యువకులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబు, జాఫర్ చాంద్రాయణగుట్టకు ఆటోలో వచ్చారని స్థానికులు వెల్లడించారు. ఆటో దిగే సమయంలో కింద నేలంతా వర్షపు నీరు నిలిచిపోయి ఉందన్నారు. దీంతో నీటిలో తెగిపడ్డ విద్యుత్ తీగలను యువకులు గమనించలేదని తెలిపారు. ఆటో దిగి ఆ లైవ్ వైర్లపై అడుగు పెట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. వర్షపు నీరు, విద్యుత్ ప్రమాదాల వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితులు తల్చుకుంటేనే భయంగా ఉందని చెప్తున్నారు. అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే కరెంట్ తీగల స్థితిగతులను క్షుణ్ణంగా పరీక్షించాలని కోరుతున్నారు.
Read Also: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. ఒకటో తేదీనే జీతాలు
Follow Us On : WhatsApp

