Mobile Popup Ad
Mobile Popup Ad

మెట్రో సెకండ్ ఫేజ్.. ఇంకా పరిశీలనలోనే!

కలం, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (Metro Phase 2) ప్రతిపాదన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని అందించడానికి, ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంటే కేంద్రం ఆమోదం తెలపడంలేదన్నది ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ నగరానికే చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఉద్దేశపూర్వకంగానే అడ్డం పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలోని అధికార బీజేపీ మధ్య ఇది రాజకీయ వివాదంగా మారింది.

మొత్తం 122.9 కి.మీ. నిడివితో ఏడు కారిడార్ల కనెక్టివిటీకి రూ. 38,559 కోట్ల ఖర్చయ్యే ప్రతిపాదనలను సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) రూపంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఫిఫ్టీ ఫిఫ్టీ నిధులతో నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. ప్రస్తుతం ఇది పరిశీలనలో ఉన్నదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి బదులు కాళ్లల్లో కట్టెలు పెట్టే తీరులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్రలు పన్నితున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం కూడా ఫైర్ అయ్యారు. అన్ని అనుమ‌తులు వ‌చ్చాక కేంద్ర మంత్రిగా ఆపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైద‌రాబాద్ ప్రజ‌లు కిష‌న్‌రెడ్డికి ఓట్లు వేస్తే మెట్రో రైల్ ప్రాజెక్టుకు అనుమ‌తులు తెచ్చే బాధ్యత‌ లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజ‌లతో గోక్కున్నోడు బాగుప‌డిన‌ చరిత్ర తెలంగాణలో లేదంటూ కిష‌న్‌రెడ్డికి సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఈ నెల 15 త‌ర్వాత బ‌రాబ‌ర్ కిష‌న్ రెడ్డి సంగ‌తి చెప్తామంటూ హెచ్చరించారు.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్‌కు (Metro Phase 2) ఆమోదం తెలపడం, ఆర్థిక సాయాన్ని చేయడం కీలకమైన అంశంగా మారింది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో, రెండేండ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇది రెండు పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రంగా మారనున్నది. బీఆర్ఎస్ పని అయిపోయిందని రెండు పార్టీలూ భావిస్తున్న నేపథ్యంలో పొలిటికల్ ఇష్యూగా మారనున్నది.

ఇంకా పరిశీలన దశలోనే: కేంద్రం

“మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ (Metro Phase 2) కోసం తెలంగాణ ప్రభుత్వం నుంచి గత నెల 4న మాకు సవరించిన ప్రతిపాదనలు వచ్చాయి. దాని ప్రకారం మొత్తం 122.9 కి.మీ. మేర ఏడు కారిడార్లలో మెట్రో రైల్ విస్తరణ జరగనున్నది. ఇది పూర్తికావడానికి రూ. 38.595 కోట్ల మేర ఖర్చు కానున్నట్లు అంచనాలు ప్రతిపాదించింది. ప్రస్తుతం దీన్ని పరిశీలిస్తూ ఉన్నాం. టెక్నికల్, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీపై సంబంధిత డిపార్టుమెంట్లు అధ్యయనం చేస్తున్నాయి..” అని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ మే 26న రాతపూర్వకంగా తెలియజేసింది.

అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం కిందికొచ్చే మెట్రో రైల్ నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, పాలసీలోని నిబంధనల మేరకు ప్రాజెక్టును పరిశీలించి సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని ఆ వివరణలో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న నిధుల లభ్యత కూడా కీలకమైన అంశంగా ఉంటుందని వివరించింది. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ – ఫిఫ్టీ నిష్పత్తిలో ఖర్చును భరించడం కూడా తుది పరిశీలన తర్వాతనే స్పష్టమవుతుందని తెలిపింది.

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డీపీఆర్ ప్రకారం మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ విస్తరణ ఇలా ఉంటుంది.. :

• కారిడార్ 4 :  నాగోల్-ఎయిర్‌పోర్ట్ – 36.8 కి.మీ. – అంచనా వ్యయం రూ. 11,815 కోట్లు
• కారిడార్ 5 :  రాయదుర్గం-కోకాపేట్ నియోపొలిస్ – 11.6 కి.మీ. – అంచనా వ్యం రూ. 4,760 కోట్లు
• కారిడార్ 6 : ఎంజీబీఎస్-చంద్రాయణ్‌గుట్ట – 7.5 కి.మీ. – అంచనా వ్యయం రూ. 2,935 కోట్లు
• కారిడార్ 7 : మియాపూర్-పటాన్‌చెరు – 13.4 కి.మీ. – అంచనా వ్యయం రూ. 4,472 కోట్లు
• కారిడార్ 8 : ఎల్బీనగర్-హయత్‌నగర్ – 7.1 కి.మీ. – అంచనా వ్యయం రూ. 2,050 కోట్లు
• కారిడార్ 10 : జేబీఎస్-మేడ్చల్ – 24.5 కి.మీ. – అంచనా వ్యయంరూ. 7,082 కోట్లు
• కారిడార్ 11 : జేబీఎస్-శామీర్…పేట్ – 22 కి.మీ. – అంచనా వ్యయంరూ. 5,481 కోట్లు
• మొత్తం 122.9 కి.మీ. – రూ. 38,595 కోట్ల అంచనా వ్యయం

ఇదీ తీరు..!
మెట్రో సెకండ్ ఫేజ్కు మొత్తం 122.9 కిలో మీటర్ల నిడివి. ఏడు కారిడార్ల కనెక్టివిటీ. రూ. 38,559 కోట్ల ఖర్చు.. ఆ మేరకు ప్రతిపాదనలను సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పంపని రాష్ట్ర ప్రభుత్వం.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఫిఫ్టీ ఫిఫ్టీ నిధులతో నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన.
ప్రస్తుతం దీన్ని పరిశీలిస్తూ ఉన్నాన్నామని.. టెక్నికల్, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీపై సంబంధిత డిపార్టుమెంట్లు అధ్యయనం చేస్తున్నాయని మే 26న తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ.

Read Also: భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>