కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో (Hyderabad Metro) రైలు ప్రాజెక్టులో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ (ఫేజ్-1)ను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీవో 127ను విడుదల చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ ప్రాజెక్టు యాజమాన్య బాధ్యతలు ఎల్‌అండ్‌టీ (L&T) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కానున్నాయి. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) పద్ధతిలో నడుస్తున్న మెట్రో రైలు, ఇకపై పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) పరిధిలోకి వస్తుంది.
ఈ స్వాధీన ప్రక్రియ కోసం ప్రభుత్వం దాదాపు రూ.15,000 కోట్ల వ్యయం చేస్తోంది. ఇందులో ప్రధానంగా ఎల్‌అండ్‌టీ సంస్థకు ఉన్న రూ.13,615 కోట్ల రుణ భారాన్ని ప్రభుత్వం భరించనుంది. దీనికి సంబంధించి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) నుంచి తక్కువ వడ్డీకి రుణాన్ని పొందేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అదేవిధంగా ఎల్‌అండ్‌టీకి ఉన్న వాటాను (Equity) కొనుగోలు చేయడానికి ప్రభుత్వం మరో రూ.1,385 కోట్లను వెచ్చించనుంది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్‌లో ఆ సంస్థకు ఉన్న 100 శాతం వాటాను ప్రభుత్వం దక్కించుకోనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మెట్రో ఫేజ్-2 విస్తరణ పనులేనని తెలుస్తోంది. మెట్రో రెండో దశ విస్తరణను కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న మొదటి దశ ప్రైవేటు సంస్థ చేతిలో ఉండటంతో, నిబంధనల ప్రకారం రెండో దశ పనులకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం మెట్రో వ్యవస్థను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

