కలం, వెబ్ డెస్క్ : హనుమాన్ జయంతి (Hanuman Jayanthi) వేడుకల దృష్ట్యా గురువారం హైదరాబాద్ మహానగరంలో మద్యం విక్రయాలను (Liquor Shops) నిలిపివేయనున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కమిషనర్ ఎం.రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కేవలం వైన్ షాపులే (Liquor Shops) కాకుండా బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు కూడా గురువారం మూసివేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి మద్యం విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. అయితే, స్టార్ హోటళ్లు.. రిజిస్టర్డ్ క్లబ్బులలోని బార్లకు మాత్రం ఈ నిబంధన నుండి మినహాయింపు ఉండనుంది.
శోభాయాత్ర కు భారీ బందోబస్తు
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో నిర్వహించే భారీ శోభాయాత్ర కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భారీ యాత్ర గౌలిగూడ రామ్ మందిర్ నుండి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగనుంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం దాదాపు 3,000 మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నారు. యాత్ర మార్గంలో ఉన్న మసీదులను పోలీసులు తాత్కాలికంగా కప్పివేసి, శాంతియుత వాతావరణం కోసం ముందస్తు చర్యలు చేపట్టారు. యాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని.. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: సమంత హెల్త్ సీక్రెట్స్ ఇవే.. ఉదయాన్నే ఇవి పాటించేయండి!
Follow Us On: Facebook

