కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమని, ఆ వార్తలు పుకార్లు మాత్రమేనని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ (CP Sajjanar) తెలిపారు. ఇంధన సరఫరాపై తలెత్తిన అపోహల నేపథ్యంలో బుధవారం టీజీసీసీసీలో కలెక్టర్ హరిచందన, అదనపు సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ శ్వేత, సివిల్ సప్లై అధికారులతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సీపీ సజ్జనర్ మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని.. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావొద్దని సూచించారు.
తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు వచ్చి వాహనాలకు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల అకస్మాత్తుగా డిమాండ్ పెరిగి కొన్ని చోట్ల తాత్కాలికంగా నో స్టాక్ (No Stock) బోర్డులు కనిపిస్తున్నాయని.. దీనిని కొరతగా భావించవద్దని కోరారు. జనం భయాందోళన చెందడం వల్ల ఈ నెల 22న 3,024 కిలో లీటర్ల ఇంధనం అమ్ముడవగా.. 23న ఆ సంఖ్య రెట్టింపై 6,400 కిలో లీటర్లకు చేరుకుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా బాటిళ్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్ లేదా డీజిల్ విక్రయిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ (CP Sajjanar) హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై నిఘా ఉంచామని తెలిపారు. అటువంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
Read Also: ఇందిరమ్మ పేరు పెట్టవద్దని చెప్పడం తప్పా?: రాకేశ్ రెడ్డి
Follow Us On : WhatsApp

