కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో అతి పెద్ద సైబర్ మోసం (Hyderabad Cyber Scam) వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టించి భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు, ఎర్రగడ్డకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ను బురిడీ కొట్టించి ఏకంగా రూ.14 కోట్లను కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ ప్రాంతంలో నివసించే డాక్టర్‌ను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు, సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నారు. కంబోడియా నుంచి అందమైన యువతుల ఫొటోలు ఉపయోగిస్తూ నకిలీ అకౌంట్లతో డాక్టర్‌తో చాట్ ప్రారంభించారు. స్నేహం పెరిగిన తర్వాత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మించారు. ఆన్‌లైన్‌లో ప్రత్యేక యాప్‌లు, వెబ్‌సైట్లు చూపిస్తూ తొలుత కొద్దిపాటి మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టించారు. మొదట్లో లాభాలు వచ్చినట్లు చూపడంతో డాక్టర్‌కు నమ్మకం పెరిగింది.
దాంతో దశలవారీగా భారీ మొత్తాలను వివిధ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేయించారు. చివరకు తన వద్ద ఉన్న పొదుపు మొత్తం సరిపోకపోవడంతో, డాక్టర్ ఇంటిని కూడా అమ్మి మరీ డబ్బులు పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తంగా రూ.14 కోట్ల వరకు నగదు బదిలీ అయిన తర్వాత అకస్మాత్తుగా సంబంధిత యాప్‌లు, అకౌంట్లు పనిచేయకపోవడంతో మోసపోయిన విషయం డాక్టర్‌కు అర్థమైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ తమ బ్యాంక్ అకౌంట్లను ఇచ్చిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మ్యూల్ అకౌంట్లు అందించి డబ్బు మళ్లింపుకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా కోట్ల రూపాయల నగదు విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితులు విదేశాల్లో ఉండగా, కంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్న నెట్‌వర్క్‌పై దృష్టి సారించినట్లు పోలీసులు చెప్పారు.
ఈ కేసు హైదరాబాద్‌లో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అతి పెద్ద సైబర్ మోసాల్లో ఒకటిగా నమోదు అయ్యింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తెలియని వ్యక్తులు చూపించే అధిక లాభాల మాటలను నమ్మి డబ్బులు బదిలీ చేయొద్దని, ఎలాంటి సందేహం వచ్చినా వెంటనే సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాలని సూచించారు.


