బ్రోకర్లకు నో ‘ఎంట్రీ’.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ, ఆర్టీవో ఆఫీసుల్లో బ్రోకర్లు (RTA Brokers), ఏజెంట్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర రవాణా శాఖ (Transport Department) సిద్ధమైంది. బ్రోకర్ల జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. వారి అక్రమాలతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై స్పందించిన శాఖ.. కార్యాలయాల్లో బ్రోకర్లకు ‘నో ఎంట్రీ’ (No-Entry Policy) విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని ఫీల్డ్‌ లెవల్ ఆఫీసర్లను ఆదేశించింది.

ప్రజలు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కోసం అవసరమైన ప్రక్రియ, చెల్లింపులు పూర్తి చేసినప్పటికీ వాటిని జారీ చేయడంలో అనవసర జాప్యం జరుగుతున్నట్టు గుర్తించింది. ఉచితంగా అందుబాటులో ఉండే ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ కు బ్రోకర్లు రూ.500 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులను రవాణా శాఖ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా ఖైరతాబాద్, మలక్‌పేట, బండ్లగూడ, కొండాపూర్, తిరుమలగిరి ఆఫీసుల పరిసరాల్లో ఏజెంట్లు బహిరంగంగానే దందా చేస్తున్నట్టు గుర్తించింది.

సర్క్యులర్ జారీ

ఈ నేపథ్యంలో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషన ర్ (విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్), హైదరాబాద్ జోన్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌తో పాటు రాష్ట్రంలోని ప్రతి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌‌(డీటీసీ), జిల్లా రవాణా అధికారులు (డీటీవోలు)కు రవాణా శాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. ఆఫీసుల్లో రహస్యంగా ఎంక్వైరీ, ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమాలను గుర్తించాలని సూచించింది. పెండింగ్‌ ఆర్సీ, డీఎల్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది.

బ్రోకర్లతో కుమ్మక్కైన అధికారులు, సిబ్బందిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుని, ఏడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థలోని లోపాలను ఎన్ఐసీ, రాష్ట్ర డేటా సెంటర్‌ సమన్వయంతో సరిచేయాలని పేర్కొంది. పారదర్శకమైన, ఇబ్బందులు లేని, అవినీతి రహిత సేవలందించడమే లక్ష్యమని తెలిపింది. బ్రోకర్ల జోక్యం, అక్రమ వసూళ్లు లేదా అవినీతి జరుగుతున్నట్టు తెలిస్తే.. నేరుగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి సమాచారం అందించాలని ప్రజలకు రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>