కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో రవాణా కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేసింది. నగరవాసులకు ప్రయాణం మరింత సులభతరం చేసేలా ఎంఎంటీఎస్, మెట్రో, టీజీఎస్‌ఆర్‌టీసీ బస్సులను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ఈ మూడు రవాణా వ్యవస్థలను అనుసంధానిస్తూ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా కామన్ టికెటింగ్ (Hyderabad Common Ticketing) విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ప్రయాణికులు వేర్వేరు టికెట్లు కొనుగోలు చేసే అవసరం లేకుండా ఒకే కార్డు లేదా మొబైల్ యాప్‌తో ప్రయాణించవచ్చు.
మెట్రో రెండోదశకు అడుగులు..
మరోవైపు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. సుమారు 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 122.9 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించనున్నారు. ఇందులో భాగంగా ఏడు కొత్త కారిడార్లకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ఈ విస్తరణ పూర్తయితే నగరంలోని మారుమూల ప్రాంతాలకు సైతం మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుంది.

