కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ సమీపంలో ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఓ మహిళా దూకి తీవ్రంగా గాయపడిన ఘటన నేపథ్యంలో భవన నిర్మాణాల్లో భద్రతా చర్యలు (Safety Measures) కచ్చితంగా అమలు చేయాలని హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ చైర్మన్ సయ్యద్ హైదర్ డిమాండ్ చేశారు. గురువారం డీఆర్ఓ రాథోడ్ రమేష్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణ ప్రాంతాల్లో సేఫ్టీ నెట్స్, బారికేడ్లు, గ్రిల్స్ వంటి కనీస రక్షణ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘించే భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర రక్షణ పరికరాలు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు.

