కలం, కరీంనగర్: సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల (Hostel Students) కు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ (Karimnagar) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ కరీంనగర్ ఎస్సీ డీడీకి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తిప్పారపు సురేష్ మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయలేకపోతున్నారని అన్నారు. విద్యార్థులకు ఉదయం పూట స్నానం చేసేందుకు వేడి నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు.
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులలో గతంలో ప్రభుత్వం వివిధ హాస్టళ్లకు గీజర్లు పంపిణీ చేసిందని, వాటిని మరమ్మతులు చేయకపోవడంతో పలు హాస్టళ్లలో అవి నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే విద్యార్థులకు స్నానం చేసేందుకు వేడి నీటి సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెడ్ షీట్లు, రగ్గులు తక్షణమే అన్ని హాస్టల్లో ఉన్న విద్యార్థులకు పంపిణీ చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కేవీపీఎస్ జిల్లా నాయకుడు సుకోసి శ్రీకాంత్, కొండ సురేష్, గంగయ్య ఉన్నారు.

