Mobile Popup Ad
Mobile Popup Ad

భద్రాచలంలో అద్భుతం.. పొయిందనుకున్న బంగారం దొరికింది!

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రం కేవలం ఆధ్యాత్మికతకే కాదు, మనుషుల్లోని నిజాయితీకి కూడా వేదికగా నిలిచింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్‌ను పోగొట్టుకోగా.. దాన్ని తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు మరో భక్తుడు. ​రాజమండ్రికి చెందిన వీర బ్రహ్మానంద స్వామి అనే భక్తుడు శనివారం భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ దర్శన సమయంలో రద్దీ వల్లనో, అజాగ్రత్త వల్లనో ఆయన చేతికి ఉన్న రూ. 3.5 లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్ చేజారిపోయింది. ఆభరణం పోయిందని తెలిశాక ఆ భక్తుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

​అదే సమయంలో కొత్తగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు అనే మరో భక్తుడికి ఆ బ్రాస్లెట్ (Bracelet) దొరికింది. కానీ ఆయన ఆశపడకుండా నిజాయితీని చాటుకున్నాడు. భద్రాచలంకు చెందిన జి. వెంకటేశ్వరరావు సహకారంతో వెంటనే దేవస్థానం అధికారులను సంప్రదించి ఆ బంగారు ఆభరణాన్ని అప్పగించారు. ​బ్రాస్లెట్ పోగొట్టుకున్న వీర బ్రహ్మానంద స్వామి అధికారులను ఆశ్రయించాడు. వివరాలు పరిశీలించిన అనంతరం ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబా, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది సమక్షంలో ఆ ఆభరణాన్ని బాధితుడికి అందజేశారు.

​లక్షల విలువైన బంగారంపై ఆశ పడకుండా తిరిగి ఇచ్చేసిన వెంకటేశ్వర్లను, ఆయనకు సహకరించిన వెంకటేశ్వరరావును దేవస్థానం అధికారులు సత్కరించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ.. రామయ్య సన్నిధిలో నా వస్తువు తిరిగి దొరకడం నా అదృష్టం. దాన్ని అప్పగించిన వ్యక్తుల నిజాయితీకి పాదాభివందనం అంటూ తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ ఘటన భద్రాచలానికి వచ్చిన ఇతర భక్తులను ప్రేరేపిస్తుందని భక్తులు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>