కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ-చందనపల్లి రహదారిపై శనివారం తెల్లవారుజామున కనిపించిన దృశ్యాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి. నల్లగొండ (Nalgonda) మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు (Dump yard) లో టన్నుల కొద్దీ వ్యర్థాలను తగలబెడుతుండటంతో పరిసర ప్రాంతాలు గ్యాస్ చాంబర్‌ను తలపిస్తున్నాయి. చందనపల్లి, కాజీరామారం, శేషమ్మగూడెం ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయాల్సింది బదులు గుట్టలు గుట్టలుగా పేరబెట్టి కాల్చేస్తుండటంతో కిలోమీటర్ల మేర దట్టమైన పొగ వ్యాపిస్తోంది. దీంతో రహదారిపై అడుగు దూరంలో ఉన్న వాహనం కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం తెల్లవారుజామున స్వచ్ఛమైన గాలి బదులు కుళ్లిన మాంసం, రసాయనాల దుర్వాసన వ్యాపిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఉద్యోగులు శ్వాసకోశ సమస్యలు, కళ్లు మండటం వంటి ఇబ్బందులతో బాధపడుతున్నారు. ”ఇది డంపింగ్ యార్డా లేక మమ్మల్ని చంపే కేంద్రామా?” అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ ప్రభావం కేవలం గాలికే పరిమితం కాలేదు. సుమారు 660 గ్రామాలకు త్రాగునీటిని అందించే పానగల్ ఉదయ సముద్రం చెరువుకు కూడా ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కుళ్లిన మాంసపు అవశేషాల నుంచి వెలువడే రసాయనాలు గాలితో పాటు చెరువులోకి చేరుతున్నాయని చెబుతున్నారు.
దశాబ్ద కాలంగా చెత్తను శాస్త్రీయంగా వేరు చేయకపోవడం, రీసైక్లింగ్ ప్రక్రియ అమలు కాకపోవడం సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యర్థాల నిర్వహణలో భాగంగా చేపట్టాల్సిన బయో మైనింగ్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో డంపింగ్ యార్డును తరలిస్తామని హామీలు ఇచ్చిన నాయకులు గెలిచిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారని విమర్శిస్తున్నారు. చెత్త దహనాన్ని వెంటనే నిలిపివేయాలని, బయో మైనింగ్ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నల్లగొండ-నకిరేకల్ రహదారిపై పొగ కారణంగా జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

