కలం, వెబ్ డెస్క్: వైసీపీ హయాంలో జగన్ దుర్మార్గపు పాలన కొనసాగించారని, తనలాంటి వాళ్ల మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టారని హోం మంత్రి వంగలపూడి అనిత (Anitha Vangalapudi) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న టీడీపీ మహానాడు (TDP Mahanadu) కార్యక్రమంలో అనిత మాట్లాడారు. నారా చంద్రబాబు కుటుంబం ఎప్పుడూ రాష్ట్ర ప్రజల కోసమే అంకితమై పని చేసిందని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి రాష్ట్ర ప్రజల కోసం ఏ తల్లి చేయని ధైర్యం చేశారని కొనియాడారు. యువ గళం పేరుతో నారా లోకేశ్ యువత గళాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో యువ గళం నిర్వహించినప్పుడు మాట్లాడే మైక్, వేసిన స్టీజీలు, కూర్చునే కుర్చీలు అన్నీ లాక్కున్నారని గుర్తు చేశారు. బయటకు వస్తే కరెంట్ తీసేవారని, సరైన రక్షణ ఇవ్వలేదని ఆరోపించారు. రోడ్లపై వెళ్తుంటే రాళ్లు, గుడ్లు విసిరే వారన్నారు. అన్నీ తట్టుకొని నారా లోకేశ్ ఓర్పు, సహనంతో ముందుకు సాగారన్నారు.
నారా లోకేశ్ (Nara Lokesh) చేసిందేదీ అధికారం కోసం చేయలేదని అనిత అన్నారు. ఆయన గతంలోనే మంత్రిగా పని చేశారని, ఆయన తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా పని చేశారని గుర్తు చేశారు. అయినా ఆయన రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ముందుకు వచ్చారన్నారు. వైసీపీ నేతలు మాట్లాడితే రెడ్‌బుక్ అంటున్నారని, తమ నాయకుడిలా గొడ్డళ్లు, కత్తులు చేతిలో పెట్టి యువతను రెచ్చగొట్టే పార్టీ తమది కాదని, ఇక ఇలాంటి రాజకీయం చెల్లదని జగన్ గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. లోకేశ్ నాడు పాదయాత్రలో రాజ్యాంగాన్ని చేతపట్టి ముందుకు సాగారని, ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించారని చెప్పారు. రాష్ట్రంలో అధికార మార్పు కోసం ప్రజలు సప్త సముద్రాలు దాటి వచ్చి ఓట్లు వేశారని, ప్రజల ఆకాంక్ష మేరకే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని, ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని అనిత (Anitha Vangalapudi) పేర్కొన్నారు.
Read Also: ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు
Follow Us On : WhatsApp

