కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఆడబిడ్డల జోలికి ఎవరైనా వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని, మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా ఉంటుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) హెచ్చరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరుగుతున్న మహానాడు వేదికగా చంద్రబాబు వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే పెట్టామని, కోర్టులో సుమారు 150 పిటిషన్లు దాఖలైనప్పటికీ వాటన్నింటినీ క్లియర్ చేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే వరకు విజయవంతంగా ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వారు, ఇప్పుడు విద్యావ్యవస్థలో ఏదో మార్పులు చేశామంటూ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీ నాయకులు సామాన్య నేరస్తులు కాదని, ఒక పత్రికను అడ్డుపెట్టుకొని అబద్ధపు వార్తలు రాస్తూ రాద్దాంతం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తూ యువతలో అపోహలు సృష్టిస్తే సహించేది లేదన్నారు. అలాంటి వారిని నడిరోడ్డుపై కూర్చోబెడతామని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తప్పు చేస్తే తాట తీస్తాం.. ఒకవేళ తప్పు చేయకపోతే ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు అని స్పష్టం చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ప్రశ్నిస్తూనే, కూటమి ప్రభుత్వం చురుగ్గా పని చేస్తుందని చెప్పారు. దీనికి డీఎస్సీ నిర్వహణే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు.

