కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతిలో ఇటీవల జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాల (Amaravati Fire Accidents)పై హోంమంత్రి అనిత (Anitha) విచారణకు ఆదేశించారు. రాజధాని అమరావతిపై కుట్రలు పన్నితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అగ్నిప్రమాదం జరిగిందని సమాచారం అందగానే.. ఐదు అగ్నిమాపక శకటాలతో రాత్రంతా శ్రమించి ఫైర్ సిబ్బంది అదుపుచేశారని తెలిపారు. వరుస ఘటనల్లో పైపులు తగలబడటంపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కలెక్టర్ల సదస్సు రోజు కూడా జరిగిన ప్రమాదం ఉద్దేశపూర్వకమేనని అనుమానాలు ఉన్నాయని అన్నారు. కొద్దిరోజులుగా వర్షం కురిసినందున ప్రమాదవశాత్తుకు అవకాశాలు తక్కువ జరిగాయని చెప్పారు. సోమవారం ఆర్సెలార్ మిత్తల్ పరిశ్రమ భూమిపూజ ఘనంగా జరిగిందని అన్నారు. అభివృద్ధిని ఓర్వలేకే నిప్పు పెట్టారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయని హోంమంత్రి అభిప్రాయపడ్డారు. గతంలో అరటితోటకు నిప్పు పెట్టిన ఉదాహరణలు ఉన్నాయన్న మంత్రి.. ప్రమాద ఘటనలపై పోలీసు శాఖ అన్ని కోణాల్లో విచారణ చేస్తోందని స్పష్టం చేశారు.
అమరావతిలో (Amaravati) రాయపూడి సమీపంలో సోమవారం అర్ధరాత్రి మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీస్ భవనాల నిర్మాణ ప్రాంతంలో మెఘా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల పరిశ్రమలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపు చేశారు.ఈ ప్రమాదంలో సుమారు రూ.8 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇటీవల ఎల్అండ్‌టీ సంస్థకు చెందిన సామగ్రి కూడా అగ్ని ప్రమాదంలో దగ్ధమైందన విషయం తెలిసిందే.
Read Also: సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Follow Us On : WhatsApp

