సొరకాయతో అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..

కలం, వెబ్ డెస్క్ : సొరకాయ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి కూర, పప్పు లేదా సాంబారు. కానీ అదే సొరకాయతో రుచికరమైన, ఆరోగ్యకరమైన టిఫిన్ కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు. పోషకాలతో నిండిన ఈ ప్రత్యేకమైన సొరకాయ దోశ (Bottle Gourd Dosa) ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ట్రై చేస్తున్నారు. ఈ కొత్త రకం రెసిపీ తయారీ విధానం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

సొరకాయ దోశ (Bottle Gourd Dosa) కావాల్సిన పదార్థాలు:

  • లేత సొరకాయ – 1
  • పచ్చిమిర్చి – 5-6
  • ఉల్లిగడ్డ తురుము – పావు కప్పు
  • క్యారెట్ తురుము – పావు కప్పు
  • కొత్తిమీర తరుగు – పిడికెడు
  • జీలకర్ర – 1 స్పూన్
  • మిరియాలు – 1 స్పూన్
  • ఉప్పు – తగినంత
  • బియ్యం పిండి – అరకప్పు
  • ఉప్మా రవ్వ – అరకప్పు
  • ఆవాలు – 1 స్పూన్
  • కరివేపాకు – 2 రెమ్మలు
  • నెయ్యి – 1 స్పూన్
  • మినపప్పు – 1 స్పూన్
  • శనగపప్పు – 1 స్పూన్
  • వెల్లుల్లి – 5 రెబ్బలు
  • పచ్చిమిర్చి – 5
  • ఇంగువ – చిటికెడు
  • కొబ్బరి పొడి – 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం:

ముందుగా లేత సొరకాయను శుభ్రంగా కడిగి, పై పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత సొరకాయను గ్రేటర్ సాయంతో సన్నగా తురుముకోవాలి. ఈ తురుములో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమంలో అరకప్పు బియ్యం పిండి, అరకప్పు ఉప్మా రవ్వ చేర్చి, తగినంత నీరు పోస్తూ కొద్దిగా గట్టిగా పిండిలా కలుపుకోవాలి. స్టౌపై పాన్ పెట్టి నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసి పోపు సిద్ధం చేయాలి. ఈ పోపును పిండిలో వేసి బాగా కలిపి, మిశ్రమాన్ని సుమారు అరగంట పాటు పక్కన ఉంచాలి .

చట్నీ తయారీ:

పిండి నానే లోపు పక్కన పెట్టుకున్న సొరకాయ పొట్టుతో చట్నీ తయారు చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. అనంతరం సొరకాయ పొట్టు, తగినంత ఉప్పు వేసి సుమారు ఐదు నిమిషాలు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, కొబ్బరి పొడి, కొత్తిమీర చేర్చి మెత్తగా గ్రైండ్ చేసి పోపు పెట్టుకోవాలి.

అరగంట తర్వాత స్టౌపై పాన్ పెట్టి వేడి చేయాలి. సిద్ధం చేసిన పిండిని దోశల్లా పోసుకోవాలి. అయితే ఇవి సాధారణ దోశల్లా పల్చగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా వేయాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. వేడివేడిగా సొరకాయ దోశలను (Bottle Gourd Dosa) ముందుగా సిద్ధం చేసుకున్న చట్నీతో కలిపి వడ్డిస్తే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.

Read Also: నిజమైన ప్రేమా? నటనా..? ఎలా గుర్తించాలి ?

Follow Us On: Facebook

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>